కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి గట్టిగా మాట్లాడుతూ కమీషన్ చేత విచారణ జరిపించింది. వారు ఎంతో గొప్పగా చెప్పుకున్నా మేడిగడ్డ బ్యారేజ్‌లో మూడు పియర్స్ క్రుంగిపోవడం, అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు దెబ్బ తినడం గురించి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల వాదనలతో బీఆర్ఎస్ పార్టీ నేతలకు తలెత్తుకోలేని పరిస్థితి కల్పించింది.
ఈ అంశంపై శాసనసభలో చర్చకు రావాలంటూ కేసీఆర్‌కి పదేపదే సవాళ్ళు విసిరినా అయన రాకపోవడంతో కాంగ్రెస్ వాదనలకు బలం చేకూర్చినట్లయింది.
కనుక ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీకి గట్టిగా కౌంటర్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కవని బీఆర్ఎస్ అధిష్టానం గ్రహించినట్లే ఉంది.
కనుక ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహంతో ధీటుగా ఎదుర్కొంటూ సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ మంత్రులను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఆ సరికొత్త వ్యూహం ఏమిటంటే, ఇంతకాలం మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూనే రాజకీయాలు జరుగుతుండేవి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మేడిగడ్డ నుంచి పారుతున్న గోదావరి నీటిని కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి ఎందుకు ఎత్తిపోయడం లేదని నిలదీస్తున్నారు.
అలాగే దేవాదుల, సీతారామ తదితర ప్రాజెక్టులలో ఏర్పాటు చేసిన మోటార్లను ఆన్ చేసి నీళ్ళు ఎందుకు ఎత్తిపోయడం లేదు?ఏపీకి ఎందుకు వదిలిస్తున్నారని గట్టిగా నిలదీస్తున్నారు.
తెలంగాణ భూములు ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్ళు వదిలిపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోందని కేటీఆర్, హరీష్ రావులు గట్టిగా వాదిస్తున్నారు. గురువుగారు (చంద్రబాబు నాయుడు)కి గురు దక్షిణగా గోదావరి నీళ్ళు దిగువకు విడిచిపెడుతున్నారని ఇద్దరో ఆరోపిస్తున్నారు.
ఈ సరికొత్త వాదనలతో ఒక్కసారిగా మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ క్రుంగిపోవడం, దాని వెనుక జరిగిన అవినీతి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఆ గోదావరి నీళ్ళలోనే కొట్టుకుపోయేలా చేయగలుగుతున్నారు.
అంతేకాదు… ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మరి బీఆర్ఎస్ నేతలు అమలు చేస్తున్న ఈ సరికొత్త వ్యూహానికి రేవంత్ రెడ్డి చెక్ పెడతారా? లేక చేతులేత్తేస్తారా? చూడాలి.




