వికేంద్రీకరణ… రాజధానికి ఓకే గానీ, పదవులకు కాదా..?

Decentralization OK for capital not for positionsవికేంద్రీకరణే మా పార్టీ నినాదం అంటూ వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ పత్రికా ముఖంగా పలుమార్లు వెల్లడించారు. 2019 ఎన్నికల విజయం తరువాత ఏపీ ప్రజలకు జగన్ ‘రాజధానుల వీకేంద్రీకరణ’ అంటూ ఎవ్వరూ ఉహించని ‘రత్నాన్ని’ అందించారు. ఆ ప్రకటనతో మొదలైన రాష్ట్ర ‘తిరోగమనం’ ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట.

ప్రతిపక్షంలో ఉన్నపుడు రాజధాని ప్రాంతానికి మద్దతుగా మాట్లాడి, అధికారంలోకి వచ్చాక రాజధానులు ప్రాంతాలను ఎంపిక చేసాం అంటూ “పెళ్లయిన వ్యక్తికి మళ్ళీ పెళ్ళి చేసిన” చందంగా రాజధానిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని పెట్టుబడులుగా పెట్టి నిర్మాణాలు చేసిన, చేస్తున్న ప్రాంతాన్ని కాదని రాజధానుల వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం.

ADVERTISEMENT

కొత్త ప్రభుత్వం వచ్చింది., కొత్త రాజధానులు అంటూ వైసీపీ నాయకత్వ అనాలోచిత నిర్ణయాలకు సజీవ సాక్షాలుగా రాజధాని ప్రాంత రైతుల జీవితాలు నిలిచాయి. గతం మరచిపోలేక.., ప్రస్తుతం మనుగడ సాగించలేక.., భవిష్యత్తు ఏంటో తెలియక వారి నిరసనలకు., ఉద్యమాలకు ప్రభుత్వం నుంచి స్పందన లేక బ్రతుకు పోరాటం చేస్తున్నారు రాజధాని రైతులు.

వైసీపీ ప్రభుత్వానికి కానీ, నాయకులకు కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి బెంగ లేదు., ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి లేదు., కానీ తమ పదవుల ఆశల మీద ‘వికేంద్రీకరణ’ అనే నీళ్లు జల్లితే మాత్రం తట్టుకోలేకపోతున్నారంటూ విపక్ష పార్టీలు విమర్శలతో రెచ్చిపోతున్నారు. ‘రాజధానుల’ వికేంద్రకరణకు ఒప్పుకున్న వైసీపీ నేతలు తమ ‘పదవుల’ వికేంద్రీకరణకు మాత్రం ‘నో ‘చెప్పడం రాజకీయ నాయకులలో ఉండే ‘స్వార్ధానికి’ అద్దం పట్టిందంటున్నారు రాజధాని వాసులు.

ముఖ్యమంత్రిగా జగన్ మంత్రుల శాఖలను రెండున్నర సంవత్సరాల తరువాత పునర్ వ్యవస్థీకరిస్తాను అని పదవుల పంపకాల సమయంలోనే పార్టీ నేతలకు వెల్లడించారు. అంటే వారి పదవి కాలం రెండున్నరేళ్లే అనేది వైసీపీ మంత్రులకు ముందుగా తెలిసిన సమాచారమే. ఐదేళ్ళ పాటు ఒకే వ్యక్తి దగ్గర అధికారం కేంద్రీకరించకుండా పదవులను,అధికారాలను కూడా నేతల మధ్య వికేంద్రీకరణ చేసారు ముఖ్యమంత్రి జగన్.

రాజధానుల వికేంద్రీకరణతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని వైసీపీ నాయకులు చెపుతున్నట్లే, పదవుల పునర్ వ్యవస్తీకరణతో కూడా వైసీపీ నేతలకు, పార్టీకి అంతే మేలు జరుగుతుందని రాజధాని గ్రామస్తులు వైసీపీ నాయకత్వానికి సూచన చేస్తున్నారు. ”పదవులు” లేకపోతేనే జీర్ణించుకోలేకపోతున్న నాయకులు మాకు “జీవితాలే” లేకుండా చేసారంటూ తమ కడుపు మంటని వెళ్లగక్కుతున్నారు ఏపీ రాజధాని అమరావతి వాసులు.

రాష్ట్ర భవిష్యత్తు నష్టపోయినా పరవాలేదు కానీ తమ రాజకీయ భవిష్యత్తుకు చిన్న ఆటంకాలు వచ్చినా తట్టుకోలేని నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టగలరా..? పదవులుంటేనే పార్టీ అయినా., పార్టీ అధినాయకుడైనా., ప్రజలైనా., అంటున్న నాయకులను అడ్డుగా పెట్టుకొని ‘వికేంద్రీకరణ’ పేరుతో జగన్ చేస్తున్న విధ్వంసాలకు ఇకనైనా స్వస్తి చెప్పాలంటూ రాష్ట్ర శ్రేయస్సును కాంక్షించే ప్రతి ఒక్కరూ గొంతెత్తుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories