
ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉదయం 9.30 గంటల వరకు పూర్తయిన లెక్కింపులో బీజేపి పూర్తి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈసారి ఎన్నికలలో బీజేపి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ముందే సూచించాయి. వాటి అంచనాల ప్రకారమే ఫలితాలు వస్తున్నాయి.
ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 స్థానాలున్నందున ప్రభుత్వం ఏర్పాటుకి కనీసం 37సీట్లు అవసరంకాగా ఇప్పటివరకు బీజేపి 40 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కనుక బీజేపి గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది.
Also Read – చంద్రబాబు-బిల్ గేట్స్: ఈ ఒక్క ఫోటో చాలు!
ఓట్ల లెక్కింపులో ఆమాద్మీ పార్టీ మొదట 37 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ క్రమంగా దాని ఆధిక్యత తగ్గుతూ ప్రస్తుతం 30కి దిగిపోయింది.
ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పేశాయి. అవి ఊహించిన్నట్లే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క స్థానంలో కూడా ఆధిక్యత సాధించలేకపోయింది.
Also Read – అమరావతి ‘పట్టాభిషేకం’…వైసీపీ ‘అరణ్యవాసం’..!
ఆమాద్మీ పార్టీకి ఈ ఓటమి చాలా పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి, తాను అవినీతికి పాల్పడలేదని ప్రజలు భావించి మళ్ళీ గెలిపిస్తేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని శపధం చేశారు. కానీ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ ఓడిపోబోతోంది. కనుక అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రజలు తీర్పు చెప్పారని బీజేపి నేతలు వాదిస్తున్నారు.
ఇక ఆమాద్మీ పార్టీకి పునాది ఢిల్లీ.. బలం ప్రభుత్వం. ఆ బలంతోనే చుట్టుపక్కల రాష్ట్రాలకు ఆమాద్మీ పార్టీని విస్తరించాలనుకున్నారు. ఆ బలంతోనే తొలిసారిగా పంజాబ్‌లో ఆమాద్మీ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కానీ ఇప్పుడు ఆమాద్మీ పార్టీ పునాది బలహీనపడింది. అధికారం కోల్పోబోతోంది.
Also Read – పోసాని కేసు: అత్యుత్సాహం వద్దు రాజా!
పైగా ఒకసారి బీజేపి అధికారం చేజిక్కించుకుంటే దానిని తిరిగి సాదించుకోవడం చాలా కష్టం. కనుక ఆమాద్మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలనే అరవింద్ కేజ్రీవాల్ కల పగటికలగా మిగిలిపోవచ్చు.
ఆమాద్మీ, బిఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి భవిష్యత్‌లో కేంద్రంలో సంకీర్ణం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని కేసీఆర్, కేటీఆర్ పదేపదే చెపుతుండేవారు. పైగా రెండు పార్టీల మద్య లిక్కర్ కనెక్షన్ కూడా ఉంది. కనుక ఆమాద్మీ పార్టీ ఓటమి కేసీఆర్‌కి, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితకి పెద్ద షాక్ కావచ్చు.
అరవింద్ కేజ్రీవాల్ వలన భవిష్యత్‌లో మళ్ళీ బీజేపి ప్రభుత్వానికి సవాళ్ళు ఎదురవకుండా నిలువరించేందుకు ఆయనని రాజకీయంగా అణగదొక్కేయాలని బీజేపి అధిష్టానం భావిస్తే తప్పకుండా లిక్కర్ కేసు ఆయుధాన్ని ప్రయోగిస్తుంది. అదే కనుక జరిగితే ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి మళ్ళీ కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.