తిరుపతి ఘటన దురదృష్టకరం. దానిపై ప్రభుత్వం అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంది. విమర్శలు, పరామర్శలు కూడా పూర్తయ్యాయి. వీటన్నిటితో పోయినవారిని ఎవరూ వెనక్కు రప్పించలేరు. కానీ దీని నుంచి పాఠాలు నేర్చుకుంటే ఇటువంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు.
సాధారణంగా ఇటువంటి సందర్భాలలో అధికార, ప్రతిపక్షాల మద్య జరిగే వాదోపవాదాలు, మీడియా ఫోకస్ ఇక్కడితో చల్లబడుతుంటుంది. కానీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలతో ఈ సమస్యని చేజజేతులా మళ్ళీ పొడిగించుకున్నట్లయింది. అంతేకాదు… మరో కొత్త వివాదం మొదలైంది.
“ఓ తప్పు జరిగినప్పుడు ప్రజలను క్షమాపణలు కోరడానికి నామోషీ ఎందుకు?” అంటూ ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు కోరడం ఆయన నిజాయితీకి నిదర్శనం. ఆయన చెప్పిన ఈ మాట కూడా నూటికి నూరు శాతం నిజం. ఇది చాలా మంచి పద్దతి.
అయితే క్షమాపణల వ్యవహారాన్ని తన వరకే పమితం చేసుకొని ఉంటే బాగుండేది. కానీ టీటీడీ ఛైర్మన్, బోర్డు కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సూచించడంతో కూటమి ప్రభుత్వానికి ఇది మరో కొత్త సమస్యగా మారింది.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుల మద్య జరిగిన వాగ్వాదం కూడా ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
మృతుల కుటుంబాలకు, శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలనే పవన్ కళ్యాణ్ సూచనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ, “శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తొక్కిసలాటలో చనిపోతే మాకు మాత్రం బాధ కలగదా?
ఆ ఘటన జరిగిన వెంటనే అందరి కంటే ముందుగా నేను, టీటీడీ పాలక మండలే సంతాపం వ్యక్తం చేసి భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాము. అయినా ఎవరో సూచించారని క్షమాపణలు చెప్పినంత మాత్రాన్న పోయినవారు తిరిగిరారు కదా?” అని అన్నారు.
దీంతో టీటీడీలో ఏం జరుగుతోంది?టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నియామకం పట్ల పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారని, ఆయన కూడా పవన్ కళ్యాణ్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారంటూ మరో కొత్త వివాదాన్ని రాజేసేందుకు అప్పుడే ఓ బ్యాచ్ సోషల్ మీడియాలో పని మొదలుపెట్టేసింది.
వాటిపై బీఆర్ నాయుడు వెంటనే స్పందిస్తూ, తాను సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదనే ఉద్దేశ్యంతోనే ఆ విదంగా అన్నాను తప్ప పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి కాదని మళ్ళీ వివరణ ఇచ్చుకున్నారు.
కానీ వైసీపీ చిలువలు పలువలుగా అల్లుకుపోయి చిచ్చు పెట్టేందుకు ఈ మాత్రం చాలు. కనుక తిరుపతి ఘటన క్రమంగా చల్లారుతుందనుకుంటే, సిఎం చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఈ క్షమాపణల వ్యవహారం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది.
దీనికంతటికీ కారణం డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నిజాయితీయే అని చెప్పక తప్పదు. నిజాయితీతో కూడిన మాటల వలన కూడా రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో గ్రహించేందుకు ఇదే చక్కటి ఉదాహరణ.
ఇది వరకు హోంమంత్రి అనిత వంగలపూడిపై ఇదే విదంగా మాట్లాడితే ఏం జరిగిందో అందరూ చూశారు. కనుక పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు తమ ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా మాట్లాడటం చాలా అవసరమే.





