పార్లమెంట్‌లో కూడా దౌర్జన్యం చేస్తారా?దేవినేని డౌట్!

Devineni Uma Maheswara Raoటిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన రెండు చిన్న ట్వీట్స్ చాలా ఆలోచింపజేస్తాయి. ముందు ఆయన ఏం ట్వీట్‌ చేశారో చూద్దాం.

ADVERTISEMENT

“పార్లమెంటులో నిలదీతలూ లేవు.. కేంద్రంపై పోరాటాలూ లేవు. విభజన హామీలు అడిగితే ఒట్టు. రైల్వే జోన్ కు అతీగతీ లేదు. కడప స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తరు. ప్రత్యేక హోదాకు బై! పోలవరం నిధులకు బైబై!! మీకేసుల గురించి తప్ప రాష్ట్రప్రయోజనాలు పట్టవా? ప్రజలకు సమాధానం చెప్పండి?@ysjagan” అంటూ ఒక ట్వీట్‌.

“పార్లమెంటు సాక్షిగా సహచర ఎంపీ @RaghuRaju_MP పై వైసీపీ ఎంపీ అసభ్యకర ప్రవర్తన సిగ్గుచేటు. వైసిపి ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలు పట్టవు. అవినీతిలో కూరుకుపోయి దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. జాతీయస్థాయిలో రాష్ట్రం పరువు తీసిన మీ ప్రజాప్రతినిధిపై ఏం చర్యలు తీసుకుంటారు?@ysjagan ” అంటూ మరో ట్వీట్‌ చేశారు.

గత ఎన్నికలలో వైసీపీకి 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేకహోదాతో సహా విభజన హామీలపై కేంద్రం మెడలు వంచి అన్నీ సాధిస్తామని జగన్‌ పాదయాత్రలో పదేపదే చెప్పారు. ప్రజలు ఆయనకు 23 మంది ఎంపీలను ఇచ్చారు. కానీ గత నాలుగేళ్లుగావిభజన హామీలలో ఏ ఒక్కటీ సాధించలేకపోగా, తమ కేసులు, అప్పుల కోసం కేంద్రానికి పూర్తిగా సరెండర్ అయిపోయారు. అందుకే మీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టావా? అంటూ దేవినేని ప్రశ్నించారు.

నేటికీ రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఆయన తమ పార్టీకి, ప్రభుత్వ అవినీతి, అసమర్ధతని నిలదీసి ప్రశ్నిస్తున్నప్పటికీ పార్టీలో నుంచి తొలగించలేని నిసహాయత. అందుకే ఆయన అరికాళ్లు వాచిపోయాయి. తన నరసాపురం నియోజకవర్గంలోనే కాదు… కనీసం రాష్ట్రంలో కూడా అడుగుపెట్టడానికి భయపడి ఆయన రెండునరేళ్ళుగా ఢిల్లీలో తలదాచుకొంటున్నారు. అక్కడే ఉంటూ తమ వైసీపీ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తున్నారు.

తాజాగా ఆయన తన సహచర వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ వ్యవహారం గురించి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ వ్రాశారు. అందుకు ఎంవీవీ సత్యనారాయణ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయనను అందరి ఎదుటే దుర్భాషలాడారు. పక్కనే ఉన్న వైసీపీ ఎంపీలు ఎవరూ ఆయనను వారించలేదు. ఆయన తిట్ల దండకం ముగిసిన తర్వాత పక్కకు తీసుకుపోయారు.

దేవినేని ఉమ దీని గురించే ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు సరిపోన్నట్లు పార్లమెంటులో కూడా మీతోటి ఎంపీ మీద దౌర్జన్యం చేస్తారా?జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ పరువు తీస్తారా?అంటూ ప్రశ్నించారు.

ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని సాక్షాత్ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విశాఖకు వచ్చి చెప్పి వెళ్ళారు. ఇప్పుడు పార్లమెంటులో ఈవిదంగా వ్యవహరిస్తే ఎవరైనా ఏమనుకొంటారు?అని దేవినేని ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories