దేవర సినిమాలో భయాన్ని పరిచయం చేయడం కాన్సెప్ట్. అలాగే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా బిఆర్ఎస్ పార్టీకి భయం పరిచయం చేయాలనుకున్నారు. వాటి కోసం కొన్ని కేసులు సిద్దం చేసుకొని ముందుగా ఎఫ్-1 రేసింగ్ కేసుతో కేటీఆర్‌కి భయాన్ని పరిచయం చేయాలని ప్రయత్నించారు.
మొదట్లో కేటీఆర్ చాలా ప్రగల్భాలు పలికినప్పటికీ, హైకోర్టు, సుప్రీంకోర్టు తన పిటీషన్స్ కొట్టేసిన తర్వాత భయం మొదలైంది. విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారనే గట్టి నమ్మకం కలిగింది.
Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?
కానీ రోట్లో తల పెట్టాక రోకటి పోటుకి భయపడి ఏం ప్రయోజనం? అని అనుకున్నారో లేదా ఎలాగూ అరెస్ట్ తప్పనప్పుడు భయపడటం కంటే సినిమా హీరోలా ధైర్యంగా నాలుగు పంచ్ డైలాగులు వేస్తూ వెళితే ఎక్కువ రాజకీయ మైలేజ్ వస్తుందని అనుకున్నారో ఏమో “ఇదో లొట్టిపీసు కేసు.. ఇలాంటివి వెయ్యి కేసులైనా ఎదుర్కొంటా…” అంటూ ఏసీబీ విచారణకు వెళ్ళారు.
అయితే ఒక్క ‘సిటింగ్’లోనే కేటీఆర్‌కి చాలా ధైర్యం వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఇదో లొట్టిపీసు కేసని, రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు నమోదు చేశారని నాకు తెలుసు…” అని ఏసీబీ అధికారులకు మొహం మీదే చెప్పేశానన్నారు.
Also Read – కేటీఆర్.. ఈ సంక్రాంతి పండుగ ఇంట్లోనే…
“నాలుగైదు ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు తప్ప వారి వద్ద అడగడానికి ఒక్క ప్రశ్న లేదు. అయినా నేనే విదేశానికి డబ్బు పంపమన్నానని చెప్తున్నాను కదా?ఇక అవినీతి ఎక్కడుంది?” అని నిలదీశానని కేటీఆర్ అన్నారు.
“పాపం రేవంత్ రెడ్డికి నన్ను కనీసం రెండు మూడు రోజులైనా జైల్లో వేసి ఆనందించాలని ఉంది. అందుకే ఈ లొట్టిపీసు కేసు నమోదు చేయించాడు,” అని ఎద్దేవా చేశారు.
Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ
నిన్న విచారణ పూర్తికాగానే అరెస్ట్ చేస్తారని కేటీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతలందరూ అనుకున్నారు. కానీ అరెస్ట్ చేయకుండా పంపించేయడంతో కేటీఆర్‌కి చాలా ధైర్యం వచ్చేసిన్నట్లుంది. అందుకే ఇప్పుడు మరింత రెచ్చిపోయి మాట్లాడుతున్నట్లున్నారు.
అయితే ఇంత పకడ్బందీగా కేసుని సిద్దం చేయించిన రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ని అంత సులువుగా తప్పించుకోనిస్తారా?అంటే కాదనే అర్దమవుతోంది. కానీ ఆయన దేవరలా కేటీఆర్‌కి భయం పరిచయం చేయాలనుకున్నారు. చేశారు.
కేటీఆర్‌ని జైలుకి పంపడం ఖాయమని గత రెండు నెలలుగా చెపుతుండటం, ఇప్పుడు ఏసీబీ విచారణ ఇందుకే అని భావించవచ్చు. కేటీఆర్‌లో ఆ భయం ఏర్పడింది కనుకనే హైకోర్టు, సుప్రీంకోర్టుకి పరుగులు తీశారు. కానీ రెండు చోట్ల ఎదురుదెబ్బలు తగలడంతో ఇప్పుడు నిజంగానే భయం ఏర్పడి ఉండాలి.
ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయకుండా విడిచిపెట్టేసినప్పటికీ త్వరలోనే అరెస్ట్ చేయక మానరని కేటీఆర్‌కి బాగా తెలుసు. కనుక ఆ భయాన్ని ఆందోళనని కప్పి పుచ్చుకోవడానికే ఈ ప్రగల్భాలు, ఈ మేకపోతు గాంభీర్యం అని భావించవచ్చు.