వైసీపీ నాయకులు వారి అధినేతను మెప్పించడానికి ట్వీట్ల తో చేస్తున్న పాట్లు చూస్తుంటే గిల్లి గిల్లిచ్చుకోవడం మాదిరి కనపడుతుంది. తమ గత రాజకీయ చరిత్రను మరిచిపోయి తామే మేధావులం అనే భావనలో విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో తెగ హడావుడి చేస్తుంటారు. 2024 ఎన్నికలు అవకాశ వాదానికి – నిజాయితీకి.., అస్థిరత్వానికి – స్థిరత్వానికి., ప్రభుత్వానికి – వ్యాపార వేత్తలకి., పేదవాడికి – పెత్తందారికి మధ్య యుద్ధం అంటూ కవిత్వాలు వెల్లవేసారు.
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల అవినీతి చేసారంటూ దేశమంతా పేరుపొందిన అతి పెద్ద పేదవాడు ఈ జగన్ మోహన్ రెడ్డి కాదా? తన తండ్రి మరణాన్ని అవకాశంగా అందిపుచ్చుకుని ముఖ్యమంత్రి పదవిని ఆశించిన నిజాయితీ పరుడు ఈ జగన్ కాదా? తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే అక్కసుతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చూసిన స్థిరత్వం కలిగిన నాయకుడు జగన్ కాదా? ప్రభుత్వం తోనే వైన్ షాపులు నడిపిస్తున్న ప్రభుత్వాధినేత జగన్ మోహన్ రెడ్డి కాదా?
విజయ సాయి చేసిన ట్వీట్స్ చూసిన ప్రతి పౌరుడికి వచ్చే ప్రశ్నలే కదా ఇవి! ఇంతకీ జగన్ అంటే విజయ సాయి కి ప్రేమ? పగా? ఇదే కాదు సింహం సింగల్ గానే వస్తుంది..,పందులే గుంపుగా వస్తాయి.., టీడీపీ – జనసేన పొత్తు తోడేళ్ళ మూట అంటూ సినిమా డైలాగ్స్ ను పదే పదే వాడే ఈ వైసీపీ నేతలకు కొంచం కూడా గతం తాలూకు వాస్తవాలు గుర్తురావా?
2004 ఎన్నికలలో టీడీపీ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఈ సింహం తండ్రి వైస్సార్ కమ్యూనిస్టులను., ఎంఐఎం పార్టీను., ఇప్పుడు బిఆర్ఎస్ అయిన అప్పుడు తెరాస పార్టీలను కలుపుకొని ముందుకెళ్లారు. మరి విజయ సాయి రెడ్డి భాషలో చెప్పాలి అంటే వైస్సార్ తోడేలా? లేక మరేదైనానా..? అధికారంలో ఉన్నాం కదా అని నోటికి వచ్చిందల్లా మాట్లాడితే ఇది అప్పటి తరం కాదు! ఏదైనా వెంటనే తిరిగిచ్చేస్తారు…లేక పొతే లావైపోతారు!
ఒక్క విజయ సాయి రెడ్డే కాదు ఈ వైసీపీ పార్టీ నాయకులందరిదీ ఇదే ధోరణి. లోకేష్ ఢిల్లీ వెళ్తే కేంద్రం కాళ్ళు పట్టుకోవడానికి వెళ్లాడని, తన తండ్రిని విడిపించుకోవడానికి బీజేపీ పెద్దలతో రాయబారాలు చేస్తున్నారని… జోగి నానా యాగీ చేస్తున్నారు. ఒక్క కేసుకే లోకేష్ కాళ్ళ మీద పడితే మరి పదుల సంఖ్యలో ఉన్న కేసుల మాఫీకి జగన్ దేని మీద పడుతున్నాడో? జోగి గారు కాస్త చూసి చెప్పరూ.



