తెలుగు అగ్ర హీరోలతో తమిళ అగ్ర దర్శకులు రూపొందిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ‘డిజాస్టర్లు’గా మారుతున్న నేపధ్యంలో… ఇప్పట్లో తమిళ దర్శకుల జోలికి తెలుగు అగ్ర హీరోలు వెళ్ళకపోవచ్చు. అయితే తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి చాలామంది తమిళ టాప్ దర్శకులు క్యూలో ఉన్నారన్నది వాస్తవం. ఆ జాబితాలోకి తాజాగా ‘అదిరింది’ చిత్ర దర్శకుడు అట్లీ కూడా చేరారు.
తొలి సినిమా ‘రాజు రాణి’తోనే తనంటే నిరూపించుకున్న అట్లీ, ఆ తర్వాత వరుసగా విజయ్ హీరోగా రెండు సినిమాలను తెరకెక్కించి టాప్ దర్శకుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. గత వారం విడుదలైన “మెర్సల్” సినిమా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురుస్తుండగా, తెలుగులో ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న అట్లీ, త్వరలోనే తెలుగు హీరోతో ఓ సినిమా చేస్తానని తెలిపారు.
గతంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో చర్చలు చేసానని చెప్పిన అట్లీ, తనకు చిరు, పవన్, మహేష్, బన్నీ, ఎన్టీఆర్ లంటే ఇష్టంగా పేర్కొన్నారు. మరి ఈ యువ దర్శకుడికి ఎవరు అవకాశం ఇస్తారో గానీ, అది ఖచ్చితంగా హాట్ టాపిక్ కావడం తధ్యం. విశేషం ఏమిటంటే… అట్లీ దర్శకత్వం వహించిన “రాజు – రాణి” సినిమాకు తెలుగు నాట ఓ ప్రత్యేకమైన అభిమానగణం ఉంది.


