దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయాలు ఒక పార్టీని చూసి మరో పార్టీ ప్రభావితం అవుతున్నాయా అనే విధంగా ముందుకెళ్తున్నాయి. తాజగా విడుదలైన తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ టీవీకే గెలుపు ఏపీ రాజకీయాలలో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇక ఇప్పుడు డీఎంకే ఓటమి బిఆర్ఎస్ పార్టీ రాజకీయాన్ని గుర్తు చేస్తుంది. గతంలో తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ చెక్ పెట్టడంతో అధికార పీఠం అందుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో ఆరు నెలలలో కూలిపోతుంటుందంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలందరు మీడియా ముందు ప్రగల్భాలు పలికారు.
కానీ కట్ చేస్తే రేవంత్ సర్కార్ ఏర్పాటు అయ్యి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తుంది, అలాగే బిఆర్ఎస్ ఆశించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం లో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరగలేదు, రేవంత్ సర్కార్ ఆరు నెలలలో కూలిపోను లేదు.
బిఆర్ఎస్ పార్టీ నేతల ప్రకటనలు, అత్యుత్సాహం అన్ని కూడా కేవలం వారి పార్టీ క్యాడర్ మానసిక సంతోషానికి పరిమితం అయ్యాయి తప్ప ఆ పార్టీ నాయకులు ఆశించినట్టు ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రభుత్వాలు కూలిపోలేదు.
ఇక ఇప్పుడు సరిగ్గా ఇదే మాదిరి తమిళనాడులో తొలి ప్రయత్నంలోనే అధికారం పీఠం అందుకున్న విజయ్ టీవీకే ప్రభుత్వం కూడా మరో ఆరు మాసాలలో కూలిపోబోతుంది అంటూ డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
త్వరలోనే కాంగ్రెస్ కూటమితో అధికారంలోకి వచ్చిన విజయ్ సర్కార్ కుప్పకూలుతుందని, తిరిగి డీఎంకే అధినేత స్టాలిన్ అధికారంలోకి వస్తారని, సీఎం విజయ్ రాజీనామా చేసిన రెండవ నియోజకవర్గమైన తిరుచ్చి ఈస్ట్ నుంచి స్టాలిన్ తిరిగి పోటీ చెయ్యాలంటూ అనితా రాధాకృష్ణన్ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.
కొళత్తూరు ని సింగపూర్ మాదిరి అభివృద్ధి చేసిన స్టాలిన్ ని ఓడించిన ఓటర్లు పనికిరానివాళ్లంటూ చివరికి తమ పార్టీ ఓటమి అసహనాన్ని ప్రజల పై రుద్దేస్తున్నారు సదరు డీఎంకే ఎమ్మెల్యే. అయితే రాజకీయాలలో గెలుపు – ఓటములు సర్వ సాధారణం. తమ పార్టీ ని అధికారం పీఠం ఎక్కిస్తే ప్రజలు విచక్షణతో ఓటేసి మంచి నిర్ణయం తీసుకున్నారని,
ఒకవేళ అదే ప్రజలు వారి పాలన నచ్చక, మార్పు కాంక్షించి వారిని ప్రతిపక్షానికి పరిమితం చేస్తే ప్రజలు తీసుకున్న నిర్ణయం విచక్షణారహితంగా ఉందంటూ, వారికీ విశ్వాసం లేదంటూ ఇలా రాజకీయ పార్టీల నేతలు, వారి అధినేతలు తమ ఓటమి అసహనాని ప్రజల పై రుద్దడం, అందుకు వారిని దోషులుగా చిత్రీకరిస్తూ వారి పై విమర్శలు చేయడం రాజకీయ నేతలకు పరిపాటిగా మారిపోతుంది.
గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం బిఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ గెలుపుకు ప్రజలే కారణం అని, వారి అనాలోచిత నిర్ణయం ఫలితంగానే రాష్ట్రంలో ఇప్పుడీ పరిస్థితులు అంటూ తెలంగాణ ప్రజలను చేసిన దానికి ఫలితం అనుభవించాలిగా అంటూ ప్రజలు పై, వారి తీర్పు పై తీవ్ర ద్వేషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక వైసీపీ అయితే ఒక అడుగు ముందుకేసి వైసీపీ ఘోర ఓటమికి ఏకంగా రాజ్యాంగ బద్దంగా జరిగే ఎన్నికల ప్రక్రియనే అనుమానిస్తూ, ఈవీఎంల ట్యాపరింగ్ అంటూ అవమానిస్తూ ప్రజా తీర్పును ఇప్పటికి అంగీకరించలేకపోతుంది. ఓటమిని స్వీకరించలేకపోతుంది.
ఇక ఇప్పుడు ఇదే కోవలోకి తమినాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే వచ్చి చేరింది. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన రెండు ద్రవిడ పార్టీలను కాదని తమిళనాడు ప్రజలు మూడో ప్రత్యామ్నాయం దిశగా అడుగులేసి విజయ్ టీవీకే పార్టీకి పట్టం కడితే ఇప్పుడు ఆ తీర్పును కించపరిచేలా డీఎంకే ఎమ్మెల్యే టీవీకే ప్రభుత్వం కూలిపోతుంది అంటూ వ్యాఖ్యానించడం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే అవుతుంది.
గెలుపును ఆస్వాదిస్తున్న రాజకీయ పార్టీల నేతలు ఓటమిని కూడా అంతే బాధ్యతగా స్వీకరించగలగాలి. ప్రజలు ఆశీర్వాదం లభిస్తే అందళం, ప్రజల తిరస్కరణ ఎదురయితే పాతాళం అనేది భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో సర్వ సహజం అనే విషయాన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటికైనా గ్రహించాలి. లేకుంటే ప్రజలకు కూడా రాజకీయాల మీద అవి చేసే రాజకీయ పార్టీల మీద, వాటిని నడిపే నాయకుల మీద నమ్మకం సడిలిపోతుంది.




