ఓ సినిమాను విడుదల చేసే ముందు సదరు నిర్మాణ సంస్థ ఫస్ట్-లుక్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు, నటీనటుల ప్రమోలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తూ హైప్ సృష్టించుకొనేందుకు ప్రయత్నిస్తుంటుంది. దాంతో ప్రేక్షకులలో తమ సినిమాపై ఆసక్తి, నమ్మకం కలిగించి ధియేటర్లకు రప్పించుకొంటే గట్టెక్కవచ్చని భావిస్తుంటారు. సినిమా కూడా ఓ వ్యాపారమే కనుక ఇవన్నీ సహజమే చాలా అవసరం కూడా.
సరిగ్గా ఇదే ఫార్ములాతో దేశంలో ఎలాంటి రాజకీయ పార్టీనైనా వాటి పనితీరు, సిద్దాంతాలతో సంబంధం లేకుండా ఎన్నికలలో గెలిపించేందుకు ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ ‘ఐప్యాక్’ స్థాపించి, ఏపీలో వైసీపీతో సహా అనేక పార్టీలను గెలిపించారు.
ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపడం చాలా శ్రమ, ఖర్చుతో కూడుకొన్న పని కనుక ఎన్నికలలో తమను గెలిపించే కాంట్రాక్ట్ ‘ఐప్యాక్’కు ఇచ్చేస్తే అంతా అదే చూసుకొంటుందని జగనన్న భావిస్తున్నట్లున్నారు. అయితే అదే ఆయనకు శల్యసారధ్యం చేస్తుండటం విశేషం.
ఏపీలో ప్రజల నాడిని తెలుసుకొని తదనుగుణంగా పాలనా విధానంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకొంటూ ముందుకు సాగాలో చెప్పాల్సిన ఐప్యాక్, ‘మా భవిష్యత్ నువ్వే జగన్’, మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్స్ అంటిస్తే వైసీపీకి తిరుగు ఉండదని సలహా ఇవ్వడం శల్యసారధ్యం చేయడమే కదా?
గడప గడపకి కార్యక్రమంలో ప్రజల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఎదురవుతోందని గుర్తించినప్పుడు, ప్రభుత్వ పాలన, విధానాలలోనే లోపం ఉందని గుర్తించి ముఖ్యమంత్రిని అప్రమత్తం చేయాలసిన ఐప్యాక్, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వారి గ్రాఫ్ పడిపోతోందని జగనన్న చెవిలో చెపుతుండటం, దాంతో ఆయన సమీక్షా సమావేశాలలో వారిపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మద్య పరస్పరం నమ్మకం కోల్పోయేలా చేస్తుండటం గమనిస్తే ఐప్యాక్ ఏవిదంగా శల్యసారధ్యం చేస్తోందో అర్దం అవుతోంది.
అయినప్పటికీ ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని వారి చేతనే స్టికర్స్ వేయించింది. అయితే ఆ స్టికర్స్ ఏనాడో వెలిసిపోయాయని గుర్తించిన ఐప్యాక్ ‘జగనన్నకు చెపుదాం’ కార్యక్రమం మొదలుపెట్టించింది. అయితే దాంతోనే జగన్ ప్రభుత్వం ఇంకా అభాసుపాలైంది.
రాష్ట్ర వ్యాప్తంగా కొండల్లా పేరుకుపోయున్న సమస్యలన్నిటినీ జగనన్న స్వయంగా మంత్రదండం తిప్పేసి తీర్చేస్తారన్నట్లు ప్రచారం చేయించగా, సమస్యలు పరిష్కారించలేకపోవడమే అందుకు కారణం.
నిజానికి ఇటువంటి కార్యక్రమాలను స్థానిక వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేత చేయిస్తే ఆ క్రెడిట్, డెబిట్ వారికే దక్కేది. తద్వారా వైసీపీ ప్రభుత్వానికి మంచో చెడో పేరు వచ్చేది. కానీ ఆచరణ సాధ్యం కానీ ఇటువంటి కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను పణంగా పెట్టడం రాజకీయంగా ఆత్మహత్యతో సమానం. అంటే ఐప్యాక్ శల్యసారధ్యం చేస్తున్నట్లే కదా?
దానికి దిద్దుబాటు లేదా కొనసాగింపుగా జూలై 1 నుంచి ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది.
రాష్ట్రంలో ఇంకా ‘మేలు జరగాల్సినవారు ఎవరైనా మిగిలిపోతే’ వారికి కూడా ఈ కార్యక్రమంలో మేలు చేసేయాలని బహుశః ఐప్యాక్ సూచనే అయ్యుంటుంది. ఈ కార్యక్రమంలో 11 రకాల సర్టిఫికెట్స్ అప్పటికప్పుడు జారీ చేసి ఇస్తారట! దీంతో రాష్ట్రంలో నూరు శాతం ప్రజలకు మేలు చేయడం పూర్తయిపోతుందని జగన్ స్వయంగా చెప్పడం గమనిస్తే, ఐప్యాక్ ఆయనకు ఏవిదంగా శల్యసారధ్యం చేస్తోందో అర్దం చేసుకోవచ్చు.
మాటలు, ఆలోచనలు తేలిక కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టమని అందరికీ తెలుసు. ఈ కార్యక్రమం విజయవంతం చేయగలిగితే మంచిదే కానీ సాధ్యం కాదు కనుక ప్రజలలో అసంతృప్తిని పెంచిన్నట్లవుతుంది కదా?
నిజానికి ఇటువంటి కార్యక్రమం ఏడాది పొడవునా నిర్వహిస్తున్నట్లయితే నేడు ఇంత హడావుడి పడాల్సిన అవసరమే ఉండదు కదా? అందుకే కదా లక్షలమంది వాలంటీర్లని నియమించుకొని, సుమారు 15 వేలకు పైగా సచివాలయాలను ఏర్పాటు చేసింది కదా?అంటే వాటితో కూడా ప్రయోజనం లేదనే కదా?
ఈ ఐప్యాక్ శల్యసారధ్యానికి పరాకాష్టగా “వై ఏపీ నీడ్స్ జగన్?” అనే ఎన్నికల నినాదం అందించింది. “మా నమ్మకం మా భవిష్యత్ నువ్వే జగన్” అని చెప్పించిన వైసీపీ నేతల చేతనే ‘రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరం?’ అని ప్రజలకు చెప్పించాలనుకోవడాన్ని ఏమనుకోవాలి?
ప్రతిపక్షాలు ఎలాగూ “ఏపీకి జగన్ అవసరమా?” అని ఇప్పటికే అడుగుతున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలే స్వయంగా ‘జగన్ అవసరం ఉందా లేదా?’ అని అడిగితే అప్పుడు ప్రజలు కూడా ‘అవసరమా?’ అని వారినే తిరిగి అడగవచ్చు!
ఐప్యాక్ ఈవిదంగా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు, విధానాలలో జోక్యం చేసుకొంటూ శల్యసారధ్యం చేస్తే ప్రమాదమని తెలంగాణ సిఎం కేసీఆర్ గ్రహించబట్టే దానిని పక్కనపడేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తూ ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళగలుగుతున్నారు. పొరుగు రాష్ట్రానికి కూడా వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. కానీ జగన్ మాత్రం ఐప్యాక్ శల్యసారధ్యంలో కురుక్షేత్ర రణరంగంలో అడుగుపెట్టబోతున్నారు. ఆల్ ది బెస్ట్!



