పిల్ల కాలువని కలుపుకునేందుకేనా… షర్మిల ప్రయత్నాలు?

YS Sharmila

ఇటీవల జగన్మోహన్‌ రెడ్డి బెంగళూరులో కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌ని కలిసి ఏపీ కాంగ్రెస్‌ నుంచి వైఎస్ షర్మిలని తొలగించి పార్టీని తనకు అప్పజెపితే వైసీపిని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పిన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. వాటిని వైసీపి ఖండించింది.

అప్పుడు వైఎస్ షర్మిల స్పందిస్తూ, వైసీపి పిల్ల కాలువ లాంటిది. ఎప్పటికైనా కాంగ్రెస్‌ అనే సముద్రంలో కలవాల్సిందే,” అని అన్నారు. అంటే కాంగ్రెస్‌లో వైసీపి విలీనం అనివార్యమని చెప్పిన్నట్లనుకోవచ్చు. ఆ దిశలో ఆమె అప్పుడే చిన్నగా ప్రయత్నం మొదలుపెడుతున్నారు.

ADVERTISEMENT

జూలై 8వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని విజయవాడలో అట్టహాసంగా వేడుకలు జరుపడానికి ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుని, వైసీపిలోకి వెళ్ళిపోయిన కాంగ్రెస్‌ నేతలను, కార్యకర్తలను వెనక్కు రప్పించుకోవాలంటే జగన్‌ చేతిలో చిక్కుకున్న ‘వైఎస్’ని వెనక్కు తెచ్చుకొని ఓన్ చేసుకోవడమే మార్గం అని వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ అధిష్టానానికి నచ్చజెప్పి ఒప్పించిన్నట్లు సమాచారం.

ఇప్పటి నుంచి శ్రమిస్తేనే వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడుతుందనే వైఎస్ షర్మిల వాదనతో కాంగ్రెస్‌ అధిష్టానం అధిష్టానం ఏకీభవించిన్నట్లు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ 5 ఏళ్ళపాటు అలుపెరుగని పోరాటాలు చేసినందునే అధికరంలోకి రాగలిగారు. కనుక వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా 5 ఏళ్ళు కష్టపడితే తప్పక ఫలితం ఉండవచ్చని, కనుక ఆమెకు అన్ని విదాల సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.

జగన్‌ వైసీపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయాలనుకున్నారో లేదో తెలీదు కానీ వైఎస్ షర్మిల మాత్రం అదే చేసేందుకు సిద్దం అవుతున్నారు.

ఇంతకు ముందు ఎన్నికలలో వైసీపి గెలిస్తే మళ్ళీ అధికారంలోకి రాగలమనే ఆశతో వైసీపి నేతలు ఎవరూ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కానీ ఇప్పుడు వైసీపిలో ఉంటేనే ప్రమాదం! కనుక వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలో నిలకడగా పనిచేస్తారనే నమ్మకం వైసీపి నేతలకు కలిగించగలిగితే పిల్ల కాలువ సముద్రంలో కలవక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories