వైసీపీ వ్యూహం మార్చిందా.. ఎవరికి లాభం… ఎవరికి నష్టం?

YSR Congressటిడిపి అధినేత “సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి” పేరిట చేస్తున్న జిల్లాల పర్యటనలు ప్రారంభించినప్పుడు వైసీపీ ప్రభుత్వం పోలీసులను పెట్టి అడ్డుకోలేదు… అభ్యంతరం చెప్పలేదు. ఎప్పటిలాగే మంత్రుల చేత ఆయన ఆరోపణలకు మీడియా ద్వారా సమాధానాలు ఇప్పించింది.

అయితే టిడిపిపై ఎంతగా ప్రతివిమర్శలు చేస్తున్నా, ఆ పార్టీ నేతలు ప్రజల మద్య తిరుగుతుండటం వలన వారికి నానాటికీ ప్రజాధారణ పెరుగుతోందని వైసీపీ కాస్త ఆలస్యంగా గుర్తించిందని చెపొచ్చు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు పులివెందుల పర్యటనతో అప్రమత్తమైన వైసీపీ వెంటనే వ్యూహం మార్చి ఎక్కడికక్కడ ఆయనను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తోంది. తమ కార్యకర్తల చేత టిడిపి శ్రేణులపై భౌతికదాడులు చేయిస్తోంది.

అంటే చంద్రబాబు నాయుడు పర్యటనలలో ఘర్షణలు, విధ్వంసం జరగాలనేదే వైసీపీ తాజా వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ఆయన పట్ల, టిడిపి పట్ల ప్రజలలో విముఖత ఏర్పడేలా చేయాలని భావిస్తున్నట్లుంది. పనిలో పనిగా టిడిపి కార్యకర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి వారిని టిడిపికి దూరం చేయాలనే దురాలోచన కూడా కనిపిస్తోంది. ఈ దాడుల మరో ముఖ్యోద్దేశ్యం టిడిపి నేతలకు తమ శక్తిసామర్ధ్యాలను గుర్తుచేయడం కూడా. మొన్న అంగళ్ళు, నిన్న పుంగనూరులో జరిగిన దాడులు, విధ్వంసం, కేసులే ఇందుకు తాజా ఉదాహరణలు.

చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు. కనుక వైసీపీ అప్పుడే అక్కడ యుద్ధవాతావరణం సృష్టించింది. ఆయనకు స్వాగతం చెపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లను మునిసిపల్ సిబ్బంది తొలగిస్తుండటంతో టిడిపి నేతలు, కార్యకర్తలు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు ఈ మాత్రం అవకాశం ఇస్తే చాలు మిగిలిన కధ రక్తి కట్టించగలరు.

అయితే టిడిపిపై తమ ప్రతాపం చూపుతున్నామని వైసీపీ భావిస్తోంది కానీ ఈ భౌతికదాడుల ద్వారా తమ అభద్రతాభావాన్ని చాటింపు వేసుకొంటున్నామని గ్రహించిన్నట్లు లేదు. అంతేగాదు… రాష్ట్రంలో ఇటువంటి ఘర్షణలు, విధ్వంసాలను కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా గమనిస్తోందని కూడా మరిచినట్లున్నారు.

పుంగనూరులో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందని నిన్న చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. రేపు మిగిలిన జిల్లాలలో కూడా ఇదేవిదంగా విధ్వంసం జరిగితే ఆయా జిల్లాల ఎస్పీల నోట కూడా ఇదే మాట వినపడితే అప్పుడు ఏమవుతుంది?అదే కారణంతో కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధిస్తే నష్టపోయేది ఎవరు?అని వైసీపీ ఆలోచించిన్నట్లు లేదు.

చంద్రబాబు నాయుడు ముసలోడని, ఆయనకు దమ్ముంటే ఒంటరిగా రావాలని సవాళ్ళు విసురుతున్న వైసీపీ, ఇప్పుడు ఒంటరిగా వస్తున్న ఆ ముసలాయనను చూసి ఎందుకు ఇంతగా భయపడుతోంది?

ఈసారి 175 సీట్లు మేమే గెలుచుకొంటామని చంద్రబాబు నాయుడుకి టిడిపి ఇవే చివరి ఎన్నికలని గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, ఆయన జిల్లా పర్యటనలు చూసి వైసీపీ ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతోంది?భౌతికదాడులకు ఎందుకు పాల్పడుతోంది?అంటే అభద్రతాభావమే అని అర్దమవుతోంది. వైసీపీకి అభద్రతాభావం లేకుంటే, 175 సీట్లు తామే గెలుచుకొంటామని నిజంగా నమ్మకముంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను అసలు పట్టించుకొని ఉండేదే కాదు…. కదా?

ADVERTISEMENT
Latest Stories