ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే వారం రోజులలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపించేస్తానని చెప్పుకున్నారు. కానీ నేటికీ యుద్ధం జరుగుతూనే ఉంది!
మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కి ఆయుధాలు, ఆర్ధిక సాయం చేయడం వల్లనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇన్నేళ్ళు కొనసాగుతోందని, దాని వలన ప్రపంచశాంతికి భంగం కలుగుతోందని వాదించిన ట్రంప్, ఇప్పుడు స్వయంగా ఉక్రెయిన్‌కి ఆయుధాలు అందజేసి యుద్ధం కొనసాగేలా చేయాలనుకోవడం చాలా విచిత్రం. అంటే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వైఖరి సరైందని ట్రంప్ ఇప్పుడు అంగీకరిస్తున్నట్లే కదా?
మొన్నటి వరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి మించిన గొప్ప స్నేహితుడు మరొకరు లేరన్నట్లు, ఆయన తన మాట జవ దాటడన్నట్లు మాట్లాడిన ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలాన్ స్కీపై నిప్పులు చెరిగారు. ఆయన చేయి మెలిపెట్టి లొంగదీసుకోవాలనుకున్నారు.
కానీ ఇప్పుడు ట్రంప్‌కి పుతిన్ శత్రువుగా కనిపించడం మొదలైంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై 500 శాతం సుంకం విధిస్తామని బెదిరిస్తున్నారు. మొన్నటి వరకు నాటోని ఖాతరు చేయని ట్రంప్ ఇప్పుడు నాటో చేత కూడా భారత్‌పై 100 శాతం సుంకం విధిస్తామని బెదిరింపజేస్తున్నారు. ఇది భారత్‌ని బ్లాక్ మెయిల్ చేయడమే కదా?
రష్యా ముడి చమురు అమ్ముకొని ఆ డబ్బుతో ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తోందని, కనుక ముడి చమురు అమ్మకాలు కట్ చేస్తే యుద్ధం నిలిచిపోతుందని ట్రంప్ ఓ సరికొత్త వాదన చేస్తున్నారు. యుద్ధం నిలిపివేయాలనుకున్నప్పుడు మరి ఉక్రెయిన్‌కి ఆయుధాలు ఎందుకు అందించాలనుకుంటున్నారు?
ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం విషయంలో కూడా ట్రంప్ ఇంచుమించు ఇలాగే మాట్లాడారు.. వ్యవహరించారు. యుద్ధం నిలిపివేయాలని రెండు దేశాలకు ‘హుకుం’ జారీ చేసి స్టెల్త్ యుద్ధవిమానాలతో ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించారు. ఇరాన్ అణు బాంబులు ప్రయోగించకుండా అడ్డుకోవడం కోసమే ఆ ప్రయత్నమని సరిపెట్టుకున్నా, నేటికీ ఇరాన్-ఇజ్రాయిల్ పరస్పరం దాడులు చేసుకొంటూనే ఉన్నాయిగా?
ఏతావాతా తేలిందేమిటంటే, అమెరికా అధ్యక్షులుగా ఎవరున్నా యుద్ధం చేయకుండా ఉండలేరు. ప్రపంచశాంతి కోసమే యుద్దం చేస్తున్నామని నమ్మబలుకుతుంటారు. కానీ అమెరికా యుద్ధోన్మాదానికి ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మూల్యం చెల్లించాల్సి వస్తుండటమే చాలా బాధాకరం.




