ట్రంప్‌: ఒక యుద్ధం ఆపి మరో యుద్ధానికి సిద్దం ఆవుతున్నారా?

Donald Trump speaking on trade war policies

కాంగ్రెస్‌ పార్టీ గురించి ఓ సామెత వంటిది ఉంది. “కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడించలేరు… తనకు తానుగా ఓడించుకున్నప్పుడే ఇతర పార్టీలు గెలుస్తుంటాయి.” దీనిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి కూడా వర్తింపజేయవచ్చు.

సుంకాలతో ప్రపంచదేశాలను హడలెత్తించి తన గుప్పెట్లో పెట్టుకోవాలని ట్రంప్‌ ఆశ పడుతున్నారు. కానీ ట్రంప్‌ అనాలోచిత నిర్ణయాలతో తన సామ్రాజ్యాన్ని తానే కూల్చుకుంటారని, కనుక భారత్‌ తొందరపడి ఆయనతో రాజీ లేదా పేచీలకు దిగనక్కరలేదని అమెరికాలో ప్రముఖ ఆర్ధికవేత్త, జాన్ హాఫ్ కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హంకీ అన్నారు.

ADVERTISEMENT

ట్రంప్‌ ప్రకటించిన అధిక సుంకాల వలన సగటు అమెరికన్లు నిత్యం వినియోగించే ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అప్పుడు అమెరికన్లు మరింత ఎక్కువ సొమ్ము ఖర్చు చేయాల్సివస్తే వారి ఆగ్రహానికి ట్రంప్‌ నిర్మించుకున్న పేక మేడలు కూలిపోతాయని ప్రొఫెసర్ స్టీవ్ హంకీ అన్నారు.

ఇది అమెరికన్లకు పొంచి ఉన్న ముప్పుకాగా, భారత్‌, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు అమెరికా నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. వీటి వలన అమెరికా కంపెనీలకు బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

కనుక ధరల పెరుగుదలతో సగటు అమెరికన్లు, యుద్ధ విమానాల కాంట్రాక్టులు రద్దు అవుతుండటంతో ఆయా సంస్థలు ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి చేసి పునరాలోచించుకునేలా చేయవచ్చు.

ఇప్పుడు ట్రంప్‌ లీలల గురించి చెప్పుకునే ముందు ఓసారి జగన్‌ గురించి ఇక్కడ ఓ నాలుగు ముక్కలు చెప్పుకోవలసి ఉంటుంది.

టీడీపి, జనసేనలు చేతులు కలిపి ఎన్నికల పొత్తులు పెట్టుకుంటే వైసీపీ ఓడిపోతుందని జగన్‌ పసిగట్టారు. కనుక ఎట్టి పరిస్థితులలో అవి కలవకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసి వాటిని ఆయనే స్వయంగా కలిపారు.

డోనాల్డ్ ట్రంప్‌ కూడా ఇప్పుడు సరిగ్గా ఇదే చేస్తున్నారు. భారత్‌-రష్యాలను దూరం చేసి రష్యా వాణిజ్యాన్ని అమెరికా దక్కించుకోవాలనుకున్నారు. ఇందుకోసం భారత్‌పై 50 శాతం పన్ను విధించారు. ఈ దెబ్బకి రష్యాకు భారత్‌ టాటా బైబై చెప్పేసి తన పంచన చేరి, పడుంటుందని ట్రంప్‌ అనుకున్నారు.

కానీ ఆ చమురు కారణంగానే భారత్‌, రష్యాలు ఇంకా దగ్గరయ్యాయి. పైగా చైనా కూడా చేతులు కలుపుతోంది. ట్రంప్‌ బాధిత దేశాలైన స్పెయిన్, స్విట్జర్లాండ్ తదితర దేశాలన్నీ కూడా ఒక్కటవుతున్నాయి. కనుక ప్రపంచదేశాలను చిన్నాభిన్నం చేసి అన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని ట్రంప్‌ అనుకుంటే అన్నీ ఏకమవుతున్నాయి.

భారత్‌-పాక్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాలను అలవోకగా ఆపించేశానని చెప్పుకుంటున్న ట్రంప్‌ అజెండాలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ విరమణ కూడా ఒకటి.

దీని కోసం ఈ నెల 15న అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో శాంతి చర్చలు జరుపబోతున్నారు. అయితే దీని కోసం ఉక్రెయిన్‌ తన భూభాగాలు కొన్ని వదులుకోవలసి రావచ్చని ట్రంప్‌ అన్నారు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ డోనాల్డ్ ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎట్టి పరిస్థితులలో ఉక్రెయిన్‌ భూభాగాలు రష్యాకు వదులుకోబోమని స్పష్టం చేశారు. అంటే చర్చలు మొదలవక మునుపే విఫలం అయ్యాయనుకోవచ్చు. పైగా రష్యా-ఉక్రెయిన్‌ల మద్య శాంతి కుదర్చబోతే ఆ రెండు దేశాలకు ట్రంపే పెద్ద విలన్‌గా మారారు. తద్వారా ట్రంప్‌ నవ్వులపాలవుతున్నారు.

కనుక ప్రొఫెసర్ స్టీవ్ హంకీ చెప్పినట్లుగా భారత్‌ కొంతకాలం ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రంపే భారత్‌తో కాళ్ళ బేరానికి వచ్చినా ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT
Latest Stories