ఏపీ వ్యాప్తంగా ‘ప్రత్యేక హోదా’ అంశం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎవరు ముందుకొచ్చి పోరాటాన్ని ప్రారంభిస్తారో, అప్పుడు ‘స్పెషల్ స్టేటస్’ ఉద్యమం అసలు రంగు బయటకు వచ్చేలా కనపడుతోంది. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ‘ప్రత్యేక హోదా’ అంశం పైనే మీడియా వర్గాలు కూడా చర్చలు జరుపుతున్నాయి. అయితే ఈ చర్చల్లో బిజెపి నేతలపై ఇతర పార్టీ నాయకులు విరుచుకుపడడం ఒక వంతయితే, ఏకంగా మీడియా ప్రతినిధులే ఏకవచనంతో సంభోదిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇప్పటికే మహా న్యూస్ ఛానల్ లో మూర్తి అనే మీడియా ప్రతినిధి ‘ప్రత్యేక హోదా’ అంశంపైన చర్చలు చేపడుతూ బిజెపి మరియు ఇతర రాజకీయ నేతలను ఒక ఆట ఆడుకుంటుండగా, దీనికి ఇతర మీడియా సంస్థలు కూడా తోడవుతున్నాయి. ఇటీవలే ప్రారంభమైన ఓ న్యూస్ ఛానల్ లో ‘ప్రత్యేక హోదా’పై చర్చ చేపట్టగా బిజెపి నుండి విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ గురించి అడ్డంగా మాట్లాడుతోన్న సదరు బిజెపి నేతను వారిస్తూ… ‘వాటీజ్ దిస్ నాన్ సెన్స్… ఆపండి మీరూ…’ అంటూ సదరు మీడియా ప్రతినిధి విష్ణుపై ఫైర్ అయ్యారు.
‘ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ప్రత్యేక హోదా తెస్తామంటే, అది ప్రజలను మోసం చేసినట్లేనని, అలా బిజెపి చేయదని, చెప్పింది ఖచ్చితంగా బిజెపి చేస్తుందని’ విష్ణు అడ్డంగా వాదిస్తున్న తరుణంలో… సదరు మీడియా ప్రతినిధి అడ్డు తగిలి విష్ణును ఓ రేంజ్ లో వేసుకున్నాడు. ఓ పురుగును చూసి చీదరించుకుంటే ఎలా ఉంటుందో, ప్రస్తుతం బిజెపి నేతలను చూస్తూ మీడియా ప్రతినిధులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నట్లుగా కనపడుతోంది. ఏపీకి చేసిన ద్రోహానికి బిజెపిపై ఒక్కొక్కరికి పీకల దాకా ఉందన్న విషయం ఈ సందర్భంగా తేటతెల్లమవుతోంది.



