తెలుగు వాడుక భాషగా మార్చేందుకు ఉద్యమించిన గిడుగు రామమూర్తిగారి జయంతి సందర్భంగా నిన్న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గిడుగు రామమూర్తిగారి మునిమనుమడు నాగేశ్వర రావు, మునిమనుమరాలు కాంతికృష్ణ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం చాలా ఆలోచింపజేస్తుంది. “దేశంలో హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. మన తెలుగు భాష భారత్‌లో 4వ స్థానంలో, అమెరికాలో 11వ స్థానంలో ఉంది. పది కోట్లకు పైగా ప్రజలు తెలుగు భాషలో మాట్లాడుతున్నారు.
ఇంత ఆదరణ కలిగిన మన తెలుగు భాషని, మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే ఉంది. ఒకప్పుడు ఉత్తరాదివారు తెలుగు వారిని మద్రాసీలుగా సంభోదించేవారు. కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుణ్యమాని మనల్ని తెలుగువారీగా గుర్తిస్తున్నారు. కనుక తెలుగు భాషని వద్దనుకుంటే మన ఉనికే ఉండదు.
ఇంగ్లీషులో చదువుకొని మాట్లాడగలిగితేనే జీవితంలో రాణించగలమని, ఉద్యోగాలు వస్తాయని, డబ్బు సంపాదించవచ్చని చాలా మంది ఓ భ్రమలో బ్రతుకుతున్నారు. అది తమని తాము ఆత్మవంచన చేసుకోవడమే.
మనలో చాలా మంది తెలుగు మీడియంలోనే చదువుకున్నాము. ఎవరైనా ఇంగ్లీషు రాని కారణంగా వెనకబడిపోయారా?కనుక ప్రాధమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. అందుకు మా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. తెలుగు భాష, సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుంటూనే పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాం. జీతం కోసం ఇంగ్లీష్, జీవితం కోసం తెలుగు నేర్పిస్తాం, “ అని అన్నారు.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం చదువుల పేరుతో తెలుగు భాషకి తీవ్ర అపకారం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో తొలిసారిగా తామే ఇంగ్లీష్ కనిపెట్టిన్నట్లు, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే బ్రతకడం సాధ్యమన్నట్లు తప్పుడు ఆలోచనలు, విధానాలతో విద్యావ్యవస్థని భ్రష్టు పట్టించిందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ తమ ప్రభుత్వం తెలుగు భాషకి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, తెలుగు భాషాభివృద్ధికి ఎవరు మంచి సలహాలు, సూచనలు ఇచ్చినా తప్పకుండా స్వీకరిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
దేశంలో తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ ప్రజలు చాలా భాషాభిమానం కలిగినవారీగా గుర్తింపు కలిగి ఉంటే, తెలుగులో మాట్లాడేందుకు కూడా నామోషీ పడేవారుగా తెలుగు ప్రజలకు గుర్తింపు ఉంది.
చైనా, జపాన్, రష్యా, జర్మనీ, కొరియా, గల్ఫ్ దేశాలలో ప్రజలు వారి భాషలోనే మాట్లాడుతారు. కనుక విదేశీయులే వారి భాషలు నేర్చుకొంటున్నారు. ఆయా దేశాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా ఏమాత్రం మొహమాటపడకుండా, సంకోచించకుండా వారి భాషలోనే ప్రసంగిస్తుంటారు.
వారికి ఇంగ్లీషు రాదని కాదు. నేర్చుకోకూడదని కాదు. కానీ వారి భాషాభిమానం అలా ఉంటుంది. ఇంగ్లీష్ ఉపయోగించనంత మాత్రన్న ఆ దేశాలన్నీ వెనుకబడిపోలేదు. మనకంటే చాలా అభివృద్ధి చెందాయి. అంటే వ్యక్తులు, సమాజం, దేశాభివృద్ధికి ఇంగ్లీష్ తప్పనిసరి కాదని స్పష్టం అవుతోంది.
కనుక తెలుగులో మాట్లాడటం నామోషీగా భావించడం మానేద్దాం. ఇంతవరకు జరిగిన పొరపాట్లని సరిదిద్దుకొనే ప్రయత్నంగా భావితరాలకు తెలుగు భాషని నేర్పించుకుందాం.




