నేటికీ వాలంటీర్లను అలా వాడేసుకుంటూ…. ఏం తెలివబ్బా?

AP Volunteers Upset with Jagan

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ తాజా నిర్ణయం ఉద్యోగాలలో కొనసాగుతున్న వాలంటీర్లలో ఆందోళన కలిగిస్తుండగా, ఎన్టీఆర్‌ ఆసరా పింఛన్ అందుకోబోతున్న లక్షల మందికి చాలా సంతోషం కలిగిస్తోంది.

టిడిపి కూటమి అధికారంలోకి వస్తే పింఛన్ నెలకు రూ.4,000 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ జూలై 1వ తేదీ నుంచి రూ.4,000 పింఛన్ చెల్లించేందుకు, దాంతో పాటు పెంచిన పింఛన్ ప్రకారం గత మూడు నెలలకు నెలకు వెయ్యి చొప్పున రూ.3,000 కలిపి మొత్తం రూ.7,000 చొప్పున చెల్లించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కనుక పింఛన్ పొందుతున్నవారందరూ చాలా సంతోషిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఈ పింఛన్లను నేటికీ ఉద్యోగాలలో కొనసాగుతున్న వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా చెల్లించాలని నిర్ణయించడంతో, ప్రభుత్వం తమని కూడా ఉద్యోగాలలో నుంచి తొలగించబోతోందా?అని వాలంటీర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని, వారి జీతాలు పెంచి నెలకు రూ.10,000 చేస్తామని, కనుక వైసీపి నేతల ఒత్తిళ్ళకు లొంగి ఎవరూ ఉద్యోగాలకు రాజీనామాలు చేయవద్దని చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్నికల సమయంలో విజ్ఞప్తి చేశారు.

కనుక రాజీనామాలు చేయకుండా ఉద్యోగాలలో కొనసాగుతున్న సుమారు లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ జీతాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తమని పక్కన పెట్టడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్ధసారధి దీనిపై స్పందిస్తూ, “వాలంటీర్ల సేవలను ఏవిదంగా వినియోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ జూలై 1వ తేదీన పింఛన్లు చెల్లించాలని సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినందున, గత నెలలో మాదిరిగానే ఈనెల కూడా సచివాలయ సిబ్బంది ద్వారా చెల్లించాలని నిర్ణయించాము. ఇది చూసి వాలంటీర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాము,” అని చెప్పారు.

ఇటువంటి అవకాశం కోసమే కాసుకు కూర్చున్న వైసీపి, అప్పుడే ‘చంద్రబాబు నాయుడు వాలంటీర్లను మోసం చేశారంటూ’ దుష్ప్రచారం మొదలుపెట్టేసింది.

అయితే 1.08 లక్షల మంది చేత బలవంతంగా రాజీనామాలు చేయించి వారిని రోడ్డున పడేసిన వైసీపి, ఇప్పుడు వారి కోసం మొసలి కన్నీరు కార్చుతూ టిడిపి ప్రభుత్వంపై బురద జల్లుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

రాష్ట్రంలో రెవెన్యూ, పంచాయితీ, మునిసిపల్ తదితర శాఖలు, రాష్ట్ర వ్యాప్తంగా వాటి కార్యాలయాలు, వాటిలో లక్షల మంది అధికారులు, ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తుండగా, వారందరినీ కాదని వాటికి సమాంతరంగా జగన్‌ త్రిశంకు స్వర్గం వంటి సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలను సృష్టించారు. ఇప్పుడు వారిని ఆదుకోవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడుపైనే పడింది. ఆదుకోకపోతే వైసీపి బురద జల్లుతోంది.

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు వ్యవస్థలను వాడుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాటినే ఆయుధాలుగా చేసుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై సందిస్తున్నారు. కనుక దీనిపై సిఎం చంద్రబాబు నాయుడు కూడా త్వరగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ADVERTISEMENT
Latest Stories