Tollywood Top Stars

టాలీవుడ్ అగ్ర హీరోలు ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి. ఒక్క ప్రభాస్ మినహాయిస్తే, ఏ ఇతర హీరో కూడా తన సినిమా రిలీజ్ అవుతుందని హామీ ఇచ్చే పరిస్థితి లేదు.

కొత్త సినిమాల మాట దేవుడెరుగు, కనీసం ఒక టీజరో, ఒక పోస్టర్ నో కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. ఇటీవల ముగిసిన మహేష్ బాబు పుట్టినరోజుకు కొత్త సినిమా కబుర్లు లేక పాత సినిమాలతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!

ఇది ఒక్క మహేష్ ఫ్యాన్స్ కే పరిమితం కాదు. టాలీవుడ్ లో ప్రతి అగ్ర హీరోల అభిమానుల పరిస్థితి ఇదే. రాబోయే 20 రోజుల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్న చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ హీరోల ఫ్యాన్స్ కూడా పాత సినిమాలనే నమ్ముకున్నారు.

లేటెస్ట్ మూవీ సంగతులను పక్కన పెట్టి, గత వైభవాలను చూసుకుని మురిసిపోయే స్థాయికి అభిమానులను తీసుకువచ్చారు. ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా దీని పైన మిశ్రమ స్పందన వస్తోంది.

Also Read – జగన్‌ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!

ఇలాంటి అనుభూతులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి గానీ, కావాల్సిన కిక్ ని అయితే పంచలేకపోతున్నాయి. ఇందులో మరో విడ్డూరం కలిగించే విషయం ఏమిటంటే, ‘రీ రిలీజ్ రికార్డులు’ అంటూ సోషల్ మీడియా వేదికగా ‘ఫ్యాన్స్ వార్’ జరుపుకోవడం.

ఈ ఒరవడికి బ్రేకులు వేసే కేవలం హీరోలపైనే ఉంది. ఏడాదికి కనీసం ఒక సినిమానైనా సెట్స్ మీద నిలబెడితే, కనీసం ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను అందించే బాధ్యతను దర్శకనిర్మాతలు తీసుకుంటారు.

Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్‌ విశాఖపట్నమే!

అలా జరిగితే పాత సినిమాలను రీ రిలీజ్ చేసి వాటి ‘రికార్డులు’ గురించి మాట్లాడుకోవడం తగ్గుతుంది. తమ హీరోను ఎప్పటికప్పుడు కొత్తగా చూసుకోవాలనేది ఏ హీరో అభిమానులకైనా ఉండే ఆకాంక్ష. దానిని పక్కనపెట్టి ‘పాత చింతకాయ పచ్చడి’తో సరిపెట్టుకోమనడం ఏ హీరోకైనా తగదు కదా!