ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు అంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో తానూ ప్రతిపక్షంలో ఉంటూ ఎటువంటి పరదాల సాయం లేకుండా రాష్ట్రం నలుమూలల ధైర్యంగా పర్యటించిన జగన్ తానూ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజలలోకి రావాలంటే భయం గుప్పిటలో పరదాల మాటున పర్యటనలు చేసారు వై.?
అలాగే 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారు. దీనితో జగన్ అధికారానికి దూరమవ్వగానే మళ్ళీ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పరామర్శల పేరుతో, భరోసా కల్పించే ఉద్దేశంతో మళ్ళీ తన ప్యాలస్ గేటు దాటి ప్రజా క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు.
అయితే ఈసారి కూడా జగన్ పర్యటనలకు సిద్దమవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తరువాతనే. గత ఐదేళ్లు తనకంటే ముందు తానూ పర్యటించే ప్రాంతానికి పరదాలు వచ్చి చేరేవి. కానీ ఇప్పుడు జగన్ వెళుతున్న చోట ఎక్కడ ఆ పార్టీ నాయకులు కానీ, జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కానీ జగన్ భద్రత కోసం ఎటువంటి పరదాలు వినియోగించడం లేదు వై.?
అంటే తన ప్రాణాలకు తన పాలనలోనూ, తన ప్రభుత్వంలోనే రక్షణ లేదని జగన్ ఇన్నాళ్లు భావించారా.? అందుకే గత ఐదేళ్లుగా పరదాల చాటున ప్రభుత్వాన్ని నడిపించారా.? తన ప్రభుత్వంలో శాంతి భద్రతల మీద జగన్ కు ఏ మాత్రం నమ్మకం లేదా.? తన కంటే బాబు మీదే జగన్ కు నమ్మకం ఎక్కువా.? బాబు ముఖ్యమంత్రిగా ఉంటే ధైర్యంగా ప్రజల మధ్య తిరగగలుగుతున్న జగన్ తానూ ముఖ్యమంత్రిగా ఉన్నన్నంత కాలం ఎందుకు పరదాలు కట్టారు.?
దీని బట్టి జగన్ కు పాలించడం చేతకాదనుకోవాలా.? లేక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చెయ్యడం తెలియదని భావించాలా.? తన ప్రభుత్వాన్ని, తన అధికారులను, తన పాలనను, తనను నమ్మి తన పార్టీకి ఓటేసిన ప్రజలను తానే నమ్మకుండా పరదాలు కట్టుకుని గత ఐదేళ్లు జగన్ ప్రజాస్వామ్యాన్నే అవమానించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు అదే రాష్ట్రం, అదే ప్రజలు, అదే అధికారులు, అన్ని అవే వ్యవస్థలు.
అప్పటికి ఇప్పటికి మారింది కేవలం రెండే అంశాలు. ఒకటి ప్రభుత్వాలు మారాయి, రెండవది జగన్ ఆలోచన దృకపథం మారింది. బాబు ప్రభుత్వం లో తన భద్రత మీద ఉన్న నమ్మకం జగన్ కు తన ప్రభుత్వంలో లేకపోవడమే ఇక్కడ కొసమెరుపు. తన ప్రభుత్వాన్నే తానే నమ్మనప్పుడు 5 కోట్ల మందికి నమ్మకం ఎలా వస్తుంది.? ఈ ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పగలరా.?




