ఏపీలో భవిష్యత్‌ రాజకీయాలను మార్చేస్తున్నారుగా!

YS Jaganతెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటం అందరూ వినే ఉంటారు. అయితే ఆయన ఏనాడూ ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపిలాగా ప్రతిపక్ష పార్టీల నేతలపై భౌతికదాడులు చేయించలేదు. ప్రతిపక్షాల కార్యాలయాలు తగులబెట్టించలేదు. పోలీస్ కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను వేధించలేదు.

తన పార్టీకి, ప్రభుత్వానికి ఎవరైనా అత్యంత ప్రమాదకరం మారుతున్నారని భావించినప్పుడే ఆయన వలవేసి పట్టుకొంటారు తప్ప ప్రతీరోజూ రాజకీయకక్ష సాధించాలని అనుకోరు.

ADVERTISEMENT

ఇదివరకు ఓటుకి నోటు కేసులో రేవంత్‌ రెడ్డిని, గత ఏడాది నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించిన ముగ్గురు బీజేపీ ప్రతినిధులను కేసీఆర్‌ వల వేసి పట్టుకొన్నారు. మళ్ళీ అటువంటి ఆలోచన చేయలేదు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్‌ కూడా తన పార్టీకి ఎదురులేకుండా చేసుకోవడానికి కాంగ్రెస్‌, టిడిపిలను నిర్వీర్యం చేసిన మాట వాస్తవం. కానీ ఆ తర్వాత ఆయన వాటి జోలికి పోలేదు.

ఆయన దృష్టి అంతా తెలంగాణ ఆర్ధిక, పారిశ్రామికాభివృద్ధి, ఐ‌టి రంగాలలో అభివృద్ధి చేసుకోవడం, సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోవడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకోవడం, విద్యా, వైద్య, విద్యుత్ రంగాలలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడంపైనే ఉంటుంది. కనుక ఈ కక్షలు, పగలు, ప్రతీకారాల గురించి ఆలోచించే సమయం కూడా ఆయనకు ఉండదు.

ఏపీలో గత నాలుగేళ్ళుగా జరుగుతున్న వికృత, పైశాచిక రాజకీయాలను చూసి అందరూ ఏవగించుకొంటున్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం పైశాచిక రాజకీయాలకు పరాకాష్టగా అందరూ భావిస్తున్నారు.

అయితే ఈ వికృత రాజకీయాలతో భవిష్యత్‌ రాజకీయాల తీరుతెన్నులే వైసీపి మార్చేస్తోందని చెప్పక తప్పదు. వైసీపి వేధింపులతో సహనం కోల్పోతున్న టిడిపి, జనసేనలు తాము అధికారంలోకి వస్తే ఇంతకింతా బదులు తీర్చుకొంటామని బహిరంగంగానే చెపుతుండటమే ఇందుకు సూచిక.

ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ వికృత రాజకీయ క్రీడలో అనేక మంది అధికారులు కూడా బలి కాబోతుండటం. కానీ వారూ ఏమీ చేయలేని నిసహాయస్థితిలో ఉన్నారు.

ఇంతకాలం వైసీపి ప్రభుత్వం చేస్తున్న అప్పుల వలన ఏపీ ఆర్ధికంగా దివాళా తీస్తుందని మాత్రమే అందరూ ఆందోళన చెందుతుండేవారు. కానీ ఇప్పుడు అంతకంటే భయానక రాజకీయాలు ఏపీలో జరుగబోతున్నాయి. ఈ రాజకీయ హోమంలో చివరికి అధికార, విపక్షాలు, అధికారులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు అందరూ సమిధలుగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories