మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అరెస్ట్‌

Ganta-Srinivasa-Raoమాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఈరోజు ఉదయం నంద్యాలలో అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు, ఆయన వాహనంలోనే ఓర్వకల్లు విమానాశ్రయానికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో విజయవాడ తరలించబోతున్నారు. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో తీసుకువెళితే, దారిపొడవునా టిడిపి శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేస్తాయని ఈవిదంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా ఈరోజు ఉదయం విశాఖలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో రగిలిపోతున్న టిడిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేయవచ్చని భావిస్తున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ముఖ్య నేతలను గృహనిర్బందం చేశారు. అనేకమంది టిడిపి కార్యకర్తలను అదుపులో తీసుకొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో భారీగా పోలీసులను మోహరించారు. విశాఖలో ముందస్తు జాగ్రత్త చర్యగా దూరప్రాంతాల బస్సులన్నిటినీ నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్రఇబ్బంది పడుతున్నారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “నన్ను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాల్సిందిగా పోలీసులను అడిగితే చెప్పకుండా అరెస్ట్‌ చేశారు. జగన్ ప్రభుత్వం అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తున్నందునే నన్ను అరెస్ట్‌ చేశారని భావిస్తున్నాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు. కనుక ఈ అరెస్టుకు భయపడే ప్రసక్తే లేదు. ఈ కేసుపై న్యాయపోరాటం చేసి నా నిజాయితీని నిరూపించుకొంటాను. టిడిపి నేతలను, కార్యకర్తలను, అలాగే రాష్ట్రప్రజలను సంయమనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories