ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ ఆదానీ తాడేపల్లి వచ్చి సిఎం జగన్‌తో భేటీ అవడం, వారిరువురూ ఏకాంతంగా సుమారు రెండు గంటలకుపైగా చర్చించుకోవడం విశేషం. ఆయన ఏపీలో పోర్టులు, డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు కనుక వాటి గురించి చర్చించి ఉండవచ్చనేది సాధారణ అభిప్రాయం.
అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, బలాబలాలు మారుతున్న సమయంలో ఆయన హటాత్తుగా అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానం వేసుకొని తాడేపల్లికి వచ్చి జగన్‌తో భేటీ అయినందున దీని వెనుక వ్యాపార కారణాలతో పాటు బలమైన రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చు. అవేమిటని ఆలోచిస్తే…
1. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత జగన్ వెంటనే ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలని కలుస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు వెళ్లలేదు. అప్పుడే జగన్‌ను కలిస్తే ఆ బురద తమకూ అంటుకొంటుందని వారు భావించి ఉండవచ్చు. ఆదానీ ప్రధాని నరేంద్రమోడీకి, ఇటు జగన్‌కు అత్యంత ఆప్తుడు. కనుక ఆదానీ ద్వారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో మోడీ, అమిత్ షాలు జగన్‌కు ఏదైనా సందేశం లేదా తదుపరి కార్యాచరణను సూచించి ఉండవచ్చు.
2. ఏపీలో ఆదానీ గ్రూప్ చాలా పెట్టుబడులు పెట్టింది. ఆదానీ పక్కా వ్యాపారవేత్త. కనుక చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం ఏపీలో తన పరిశ్రమలు, పెట్టుబడులు, వ్యాపారాలపై చాలా దుష్ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన చెందడం సహజం. బహుశః అదే వివరించి కాస్త దూకుడు తగ్గించుకోమని ప్రధాని మోడీ తరపున సందేశం ఇచ్చి ఉండవచ్చు.
3. చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఏపీలో టిడిపి ఇప్పుడు బలహీనంగా ఉంది. కనుక జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ముందస్తుకు వెళ్ళినా, వెళ్ళకపోయినా వెళితే ఎన్నికలకు భారీగా ఖర్చులు ఉంటాయి. ఏపీలో ఆదానీ గ్రూప్‌కు జగన్ ప్రభుత్వం చేస్తున్న మేలుకు బదులుగా ఆదానీ వైసీపికి ఎన్నికలకు భారీగా నిధులు సమకూర్చాలని కోరుకోవడం సహజం. బహుశః ఈ విషయం గురించి చర్చించడానికే ఆదానీని తాడేపల్లికి ఆహ్వానించి ఉండవచ్చు.
ఏది ఏమైనప్పటికీ, ‘ఊరక రారు మహానుభావులు’ అన్నట్లు ఆదానీ-జగన్ భేటీకి ఏదో బలమైన కారణమే ఉంటుంది. అదేమిటో రాబోయే రోజుల్లో క్రమంగా బయటపడుతుంది. ఇకపై వైసీపి ప్రభుత్వం అనూహ్యంగా ఏవైనా రాజకీయ నిర్ణయాలు తీసుకొన్నా లేదా ఏపీలో ఆదానీ గ్రూప్ కొత్తగా ఏవైనా వ్యాపార నిర్ణయాలు తీసుకొన్నా వాటితో వారి భేటీకి కారణం ఏమిటో తెలియవచ్చు.
Always insightful meeting with @ysjagan HCM AP. Discussed Adani's key ventures in AP, notably Gangavaram Port and the Vizag Data Center. Together, we see these projects as pivotal drivers for a thriving Andhra Pradesh. pic.twitter.com/60g0fc6980
— Gautam Adani (@gautam_adani) September 28, 2023



