ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు వైసీపి అభ్యర్ధుల రెండో జాబితాని ప్రకటించడంతో మళ్ళీ వైసీపిలో పొగలు సెగలు మొదలయ్యాయి. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని పక్కన పెట్టి ఆ స్థానాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కేటాయించడంతో, మంగళవారం రాత్రి ఆయన అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.
ఆయన కూడా జగన్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈరోజు తన అనుచరులతో సమావేశమయ్యి భవిష్య కార్యాచరణ అంటే… పార్టీ మారడం గురించి చర్చిస్తున్నారు. వైఎస్ షర్మిల ఎలాగూ ఏపీ కాంగ్రెస్ తలుపులు తెరువబోతున్నారు కనుక దానిలోకి జంప్ అయితే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు కనుక ‘ఫస్ట్-కమ్-ఫస్ట్-సర్వ్’ బేసిస్‌లో ఆమె టికెట్లు పంచిపెట్టవచ్చు. కనుక ఆమె తలుపులు తీయక ముందే క్యూలో ఉన్నట్లు మంగళగిరి వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ప్రకటించేశారు. కనుక మల్లాది విష్ణుతో సహా జగన్ పక్కన పెట్టినవాళ్ళందరూ కూడా వైఎస్ షర్మిలకి జై కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఇక విజయవాడ వెస్ట్ వైసీపి ఎమ్మెల్యే వెల్లంపల్లిని ఈసారి సెంట్రల్‌కు మార్చడంతో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ళు విజయవాడ వెస్ట్‌లో పనిచేసుకొంటూ పూర్తి పట్టు సాధించిన తర్వాత ఎన్నికలకు ముందు తనను సెంట్రల్‌కు మారిస్తే ఓడిపోతే తన పరిస్థితి ఏమిటని వెల్లంపల్లి ఆందోళన చెందుతున్నారు. కనుక ఈరోజు ఉదయమే ఆయన తాడేపల్లికి బయలుదేరిన్నట్లు తెలుస్తోంది.
ఇక ఒంగోలులో బాలినేని సెగలు కక్కుతూనే ఉన్నారు. తనను అక్కడి నుంచి తప్పించేందుకు లేకుంటే పక్కనపెట్టేందుకు పార్టీలో నేతలే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన భయపడుతున్నట్లే ఇప్పుడు గిద్దలూరు నుంచి పోటీ చేయాలని తాడేపల్లి నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆయన గిద్దలూరుకి షిఫ్ట్ అయితే ఒంగోలు నుంచి సిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్‌ని బరిలో దింపుతామని చెప్పడంతో, గిద్దలూరు కాదు పార్టీ నుంచే వేరే పార్టీలోకి షిఫ్ట్ అవుతానని చెపుతున్నట్లు తెలుస్తోంది.
మరో మంత్రి ఇంటి పేరు చెల్లుబోయిన అయినప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురంలో చెల్లడం లేదు. ఆ సీటుని పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్‌కి అప్పగించి మంత్రి వేణుగోపాల్‌ని రాజమండ్రి రూరల్‌కి పంపించేశారు.
జగన్ భజనలో తరించిపోయిన వారిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఒకరు. కానీ రెండో జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి మలసాల భరత్ పేరు కనిపిస్తోంది. కనుక అమర్నాథ్ తాడేపల్లి బయలుదేరుతారో లేక విజయవాడలో కాంగ్రెస్ ఆఫీసు వైపు తిరుగుతారో చూడాల్సిందే.




