బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ కూడబలుక్కొన్నట్లు ఏపీకి వచ్చి జగన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తీవ్ర విమర్శలు చేసి వెళ్ళారు. వారు వెళ్ళిన మర్నాడే కేంద్ర ప్రభుత్వం పన్నులలో వాటాగా ఏపీకి రూ.4,787 కోట్లు విడుదల చేసింది.
త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున అమిత్ షా ఎల్లుండి తెలంగాణలో పర్యటించి కేసీఆర్ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయబోతున్నారు. అంతకంటే ముందే తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం రూ.2,486 కోట్లు విడుదల చేసింది. ఇంకా దేశంలో పలు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 1,18,280 కోట్లు సోమవారం విడుదల చేసింది.
మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉంది. కనుక జేపీ నడ్డా, అమిత్ షా తిడితే తిట్టారు కానీ రూ.4,787 కోట్లు ఇచ్చేరు చాలా సంతోషం! ఇలా నిధులు విడుదల చేస్తుంటే ఇంకా ఎన్ని తిట్లు అయినా భరించవచ్చు.
అయితే వైసీపీతో రహస్యంగా దోస్తీ ఉండొచ్చేమో కానీ బహిరంగంగా రాజకీయ శత్రువుగానే పరిగణిస్తామని ఇద్దరూ తేల్చి చెప్పేశారు కనుక బిజెపితో ఏవిదంగా వ్యవహరించాలో మంత్రులకు ‘జగనన్న పాఠాలు’ చెప్పిన్నట్లే ఉన్నారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ, “ఒంటరిగా మమ్మల్ని ఎదుర్కోగలరా లేదా?అని మేము అడుగుతుంటే టిడిపి, జనసేనలు జవాబు చెప్పవు కానీ బిజెపి నేతలు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తే పండగ చేసుకొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావలసిన నిధులే ఇస్తోంది తప్ప అదనంగా ఇచ్చింది ఏమీ లేదు.
అమిత్ షా వైజాగ్ వస్తున్నారంటే రాష్ట్రానికి ఏదో మేలు చేస్తారని ఆశించాము. కానీ ఆయన తన ప్రసంగంలో మమ్మల్ని విమర్శించడానికే పరిమితమయ్యారు. కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా చెపుతారేమో అని చూశాము. కానీ దాని గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. ప్లాంట్ ప్రయివేటీకరణతో వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడతారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు తమ అధిష్టానంతో మాట్లాడరు?
మా ప్రభుత్వాన్ని విమర్శించడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. బహుశః అందుకే అమిత్ షా కూడా విమర్శించినట్లున్నారు.
మేము కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము. ఈ విషయం ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలకు కూడా బాగా తెలుసు. ఒకవేళ మేము నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లయితే అప్పుడే సిఎం జగన్ కలిసినప్పుడు అడిగి ఉండాలి కదా?కానీ ఇప్పుడు ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని మేము అవినీతికి పాల్పడుతున్నట్లు అమిత్ షా మాట్లాడటం మాకు చాలా బాధ కలిగించింది.
కేంద్ర ప్రభుత్వం సహకరించిన సహకరించకపోయినా సిఎం జగన్ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తూ లక్షల కోట్లు ఇస్తున్నారు. మా చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి?” అని ప్రశ్నించారు.



