జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడంతో గండికోట రహస్యాలు కొన్ని బయటపడ్డాయి. ఆ తర్వాత కొందరు వైసీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరడంతో మరికొన్ని రహస్యాలు బయటపడ్డాయి.
జగన్ రైట్ హ్యాండ్ విజయసాయి రెడ్డి బయటకు రావడంతో కోటరీ కధలు బయటపడ్డాయి. ఆస్తులలో వాటాల కోసం జగన్ స్వయంగా తల్లి, చెల్లిని కోర్టుకి ఈడ్చడంతో మరికొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి.
ఇంతకాలం జగన్ పాలనలో ఆయన గురించి ప్రజలకు చక్కటి అవగాహన ఏర్పడింది. ఇప్పుడు వైసీపీలో ఒకరొకరు బయటకు వచ్చి చెపుతున్న మాటలతో జగన్ సంపూర్ణ విశ్వరూపం అవిష్కారం అవుతోంది.
విజయసాయి రెడ్డికి వెంటనే కౌంటర్ పడుతుందని ముందే అనుకున్నాము. కనుక ముందుగా మాజీ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓపెనింగ్ చేశారు.
అయితే నాడు హైదరాబాద్‌లో ఎఫ్-1 రేసింగ్ గురించి మాట్లాడబోయి కోడి, గుడ్డు అంటూ ఏదేదో మాట్లాడేసి కోడి-గుడ్డు మంత్రిగా పాపులర్ అయిపోయిన్నట్లే, ఇప్పుడు వైసీపీలో అందరి కంటే ముందుగా విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇవ్వాలనే తాపత్రయంతో జగన్ చుట్టూ కోటరీ ఉన్న మాట వాస్తవమని చెప్పేసి విజయసాయి రెడ్డి ఆరోపణలను ధృవీకరించేశారు.
తర్వాత నాలిక కరుచుకొని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతీ రంగంలో, ప్రతీచోట కోటరీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చుట్టూ కోటరీ లేదా? రాధాకృష్ణ, రామోజీరావు ఎవరు? కోటరీలో వారే కదా?” అని సర్ధి చెప్పుకున్నారు.
విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ఇంతకాలం ఆయన కోటరీలో ఉండి ఇప్పుడు కోటరీ అంటూ ఈవిదంగా మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది. జగన్ వలన తన మనసు విరిగిపోయిందన్నారు. కానీ ఆయన మనసు మరెవరి కోసమో విరిగిపోయిందని నేను భావిస్తున్నాను. అదెవరో ఆయనే చెపితే బాగుంటుంది,” అని గుడివాడ అమర్నాధ్ అన్నారు.
జగన్ చుట్టూ ఎటువంటి కోటరీ లేదని, ఆయన పార్టీలో అందరికీ అందుబాటులో ఉంటారని, విజయసాయి రెడ్డి అక్కసుతోనే జగన్ గురించి ఈవిదంగా మాట్లాడారని, గుడివాడ అమర్నాధ్ అని సమాధానం చెప్పి ఉంటే బాగుండేది.
కానీ విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో గుడివాడ అమర్నాధ్ చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటూ ఆయన కూడా కోటరీ కబుర్లు చెప్పి, జగన్‌కి, పార్టీకి కూడా ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు. వైసీపీలో రాజకీయ పరిపక్వత, అవగాహన ఉన్న కొందరు నేతలు మాట్లాడరు. అది లేనివారు మీడియా ముందుకు వచ్చి ఇలా ఏదేదో మాట్లాడేస్తుంటారు.




