Guntur Roads Now Changed in TDP Regime

జగన్‌ 5 ఏళ్ళు పాలన చేసి మూడు రాజధానులు ఏర్పాటు చేయలేకపోయారు. కనీసం రాష్ట్రంలో రోడ్లకు మరమత్తులు కూడా చేయించలేకపోయారంటే విస్మయం కలుగుతుంది. అయినా పంచాయితీ కార్యాలయాలు, పార్కులు వగైరా తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నప్పుడు, ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించలేనప్పుడు వేలకోట్లు ఖర్చు చేసి కొత్త రోడ్లు వేయిస్తారని ఎవరూ ఆశించలేదు కూడా. కనీసం గుంతలైనా పూడ్చితే చాలనుకున్నారు. కానీ విధ్వంసమే తప్ప నిర్మాణం తెలియని జగన్‌ అంత చిన్న పని కూడా చేయించలేక చేతులెత్తేశారు.

తాడేపల్లి ప్యాలస్‌కి కూతవేటు దూరంలోనే ఉన్న గుంటూరులో గుజ్జన గుండ్ల నుంచి పలకనూరు మార్గంలో 1.7 కిమీ పొడవునా రోడ్లపై వరుసగా పెద్ద పెద్ద గుంతలు పడి చెరువులుగా మారిన ఫోటోలు, వైసీపీ దౌర్భాగ్య పాలనకు నిదర్శనంగా నేటికీ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.

Also Read – సంక్రాంతికి సినిమాలు… తర్వాత ఐటి రెయిడ్స్?

2022 జూలైలో ఆ ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. ఆ రోడ్లు మరమత్తు చేయడానికి కేవలం నాలుగు కోట్లు ఖర్చు చేస్తే జగన్‌ పరువు, వైసీపీ నేతల పరువు కాపాడబడి ఉండేది. కానీ తన కోసం వందల కోట్లు ఖర్చు చేసి భద్రతా ఏర్పాట్లు, ఋషికొండపై విలాసవంతమైన ప్యాలస్‌లు కట్టించుకున్న జగన్‌, రోడ్ల మరమత్తులకు కేవలం నాలుగు కోట్లు కేటాయించేందుకు ఇష్టపడలేదు.

నిజానికి వైసీపీ నేతలు తలుచుకుంటే తమ జేబులో నుంచే తీసి ఆ మాత్రం ఖర్చు పెట్టి పని చేయించగలరు. కానీ మీడియా, ప్రజలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నా ‘నవ్వితే నవ్విపోదురు గాక మాలేక సిగ్గు ఎగ్గు,’ అని ఎవరూ కూడా పట్టించుకోకుండా వదిలేశారు.

Also Read – పాన్ ఇండియా స్థాయిలో వర్మ పాపాల పొద్దు..!

ఆనాడు ఈ రోడ్ల సమస్యలను టీడీపీ, జనసేనలు చాలా హైలైట్ చేసి వాటి కోసం జగన్‌ ప్రభుత్వంతో పోరాడాయి. కనుక కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట కొత్త రోడ్లు నిర్మించడానికి, గుంతలు పడిన రోడ్లను పూడ్చడానికి సుమారు రూ.3,800 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది.

సంక్రాంతిలోగా రాష్ట్రంలో రోడ్లపై గుంతలు కనపడకూడదని సిఎం చంద్రబాబు నాయుడు గడువు విధించడంతో యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు జరుగుతున్నాయి. వాటిలో గుంటూరులో ఈ ‘ఐకానిక్ రోడ్’ కూడా ఒకటి.

Also Read – ఇది జగన్‌ ఎఫెక్టేనా?

ఆ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు నిధులు విడుదల చేయడంతో గుత్తేదారు వెంటనే పనులు మొదలు పెట్టి గుంతలన్నీ పూడ్చేసి, రోడ్డు విస్తరణ చేసి మద్యలో డివైడర్ కూడా ఏర్పాటు చేశారు.

దీంతో నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆ ఐకానిక్ రోడ్ ఫోటోని వెతికి పట్టుకొని, పాత, కొత్త రోడ్ ఫోటోలు పెడుతున్నారు.

ప్రజలకు ఈ పాటి మేలు చేస్తేనే ఎంతో పొంగిపోతూ ఇన్ని పోస్టులు పెడుతున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు కలలు కంటున్నట్లు అమరావతి, పోలవరం పూర్తి చేసి, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించి, విశాఖ, విజయవాడలో మెట్రో, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిచేసి చూపిస్తే ఇంకెంత పొంగిపోతారో.




ఈ పనులు పూర్తిచేయగలిగితే చాలు… రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎన్నడూ జగన్‌కి అవకాశం ఇవ్వడం గురించి కలలో కూడా ఆలోచించరు.