ఇంతకీ ఆ కేసులో కేసీఆర్‌ ఓడారా… గెలిచారా?

kcr-brs-

తెలంగాణలో కేసీఆర్‌ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారని కాంగ్రెస్‌ మంత్రులు చెపుతున్నారు.

ఖాళీ అయిపోతున్న పార్టీని, నాలుగు నెలలుగా జైల్లో ఉన్న కూతురు కల్వకుంట్ల కవితని ఎలా కాపాడుకోవాలో తెలియక కేసీఆర్‌ సతమతమవుతున్నారు.

ADVERTISEMENT

ఈ పరిస్థితులలో చిన్నపాటి ఉపశమనం కూడా గొప్ప విజయంగానే కనిపించడం సహజం. సుప్రీంకోర్టులో ఆయనకు కాస్త ఉపశమనం లభించింది కానీ పూర్తిగా మాత్రం కాదు.

ఆయన తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రికాగానే విద్యుత్ రంగ నిపుణులు, కేంద్ర ప్రభుత్వం ఎంతగా వారిస్తున్నా వినకుండా హడావుడిగా కాలం చెల్లిన టెక్నాలజీతో యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు. అలాగే ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలుకి ఒప్పందం చేసేసుకుని వాటి గురించి గొప్పగా చెప్పుకున్నారు.

కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వాటి వలన తెలంగాణకు వేల కోట్లు నష్టం వచ్చిందంటూ జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్‌ చేత విచారణ జరిపిస్తోంది.

కమీషన్‌ ఎదుట విచారణకు హాజరుకమ్మని కేసీఆర్‌కు నోటీస్‌ పంపిస్తే, “విచారణ చేసే అర్హత, అధికారం రెండూ మీకు లేవు కనుక మీరే తప్పుకోండి…” అంటూ ఘాటుగా లేఖ వ్రాశారు.

అంతటితో ఊరుకుంటే ఏమి జరిగేదో కానీ హైకోర్టులో పిటిషన్‌ వేసి ఎదురుదెబ్బ తిన్నారు. కమీషన్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేస్తే ఆ అవసరం లేదని హైకోర్టు చెప్పింది. దాంతో కేసీఆర్‌ సుప్రీంకోర్టుకి వెళ్ళక తప్పలేదు.

ఆయన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు, జస్టిస్ నరసింహా రెడ్డి విచారణ మద్యలో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడటం తప్పని, కనుక ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశించింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే అంగీకరించింది.

కేసీఆర్‌ సుప్రీంకోర్టుకి వెళ్ళి కమీషన్‌ ఛైర్మన్‌ని మార్పించగలిగారు. కనుక దీని గురించి గొప్పగా చెప్పుకొని న్యాయం, ధర్మం అంటే… తానే గెలిచానని గొప్పలు చెప్పుకుంటూ మళ్ళీ కాస్త హడావుడి చేయవచ్చు.

కానీ సుప్రీంకోర్టు వెళ్ళినా కమీషన్‌ విచారణ జరుపకుండా ఆపలేకపోయారు. కనుక మళ్ళీ విచారణకు రమ్మనమని కమీషన్‌ ఆయనకు నోటీస్‌ పంపితే, మరోసారి ఘాటుగా లేఖ వ్రాయలేరు. తప్పనిసరిగా కమీషన్‌ ఎదుట హాజరయ్యి సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు. కనుక కేసీఆర్‌ సుప్రీంకోర్టుకి వెళ్ళి గెలిచారా… ఓడారా?

ADVERTISEMENT
Latest Stories