తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం తర్వాత దిల్‌రాజు బయటకు వచ్చి చాలా అద్భుతంగా జరిగిందని నవ్వుతూ చెప్పుకున్నప్పటికీ లోపల అందరికీ వాతలు పడ్డాయని ఆయన మాటలతోనే తెలిసిపోయింది. ఆ సమావేశానికి ముందే సిఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకి పెద్ద బ్రేకులు వేశారు.

సమావేశంలో సినీ పరిశ్రమకు సిఎం రేవంత్ రెడ్డి వరాలేమీ ఇవ్వలేదని కేవలం విధులు, బాధ్యతల గురించి క్లాస్ పీకారని అర్దమవుతూనే ఉంది. వాటిలో భాగంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ సినీ నటీనటులు వీడియోలు చేసి ఇవ్వాలనే షరతు ఒకటి ఉంది.

Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!

రేవంత్ రెడ్డి ఇదివరకు రెండు మూడుసార్లు దీని గురించి సినీ పరిశ్రమకి విజ్ఞప్తి చేశారు. కానీ ఇంత గట్టిగా చెపితే తప్ప చెవికెక్కలేదు. డిసెంబర్‌ 26న ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం జరుగగా, నేడు ప్రభాస్‌ ఓ వీడియో సందేశం చేసి అందించారు. అంటే ఆరేడు నెలల క్రితం చెపితే పట్టించుకోని సినీ పరిశ్రమ ఇప్పుడు కేవలం 5 రోజులలోనే స్పందించింది.

“జీవితంలో మనకు బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఉన్నాయి. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మనవాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు మనకీ డ్రగ్స్ అవసరమా డార్లింగ్?సే నో టు డ్రగ్స్.. మీకు తెలీసున్నవారిలో ఎవరైనా ఈ మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయండి.. మాదక ద్రవ్యాలకి అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించండి,” అంటూ ప్రభాస్‌ విజ్ఞప్తి చేశారు.

Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!

ఈరోజు రాత్రి న్యూఇయర్ వేడుకలు జరుగబోతున్నాయి. ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా ఎంత కట్టడి చేసినా ఎక్కడో అక్కడ డ్రగ్స్ వాడకం జరుగుతుంది. కనుక సరిగ్గా ఇటువంటి సమయంలో ప్రభాస్‌ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుతూ వీడియో చేసి పోస్ట్ చేయడం అభినందనీయమే. బహుశః త్వరలో పెద్ద హీరోలందరూ కూడా వీడియోలు చేసి పోస్ట్ చేస్తారని ఆశించవచ్చు. వారి విజ్ఞప్తికి అభిమానులు తప్పకుండా స్పందిస్తారు. కనుక ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వం చేత కూడా దీని కోసం చెప్పించుకోకుండా పనిలో పనిగా కొన్ని వీడియోలు చేసి ఇస్తే బాగుంటుంది కదా?




Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?