జగన్ కు దెబ్బ మీద దెబ్బ.. నిన్న కేంద్రం.. ఈ రోజు హై కోర్టు

Jagan And Highcourtఏపీ ప్రభుత్వానికి వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు రాజధానుల ఫార్ములాతో ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వానికి అనుకోని రీతిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కేంద్రం ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ.. అక్కడ సచివాలయాన్ని నిర్మించుకోవడానికి నిధులను కేటాయించింది.

ఇవాళ ఏపీ హైకోర్టు ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు అని కుండబద్ధలు కొట్టింది. ఏపీ సీఆర్డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను సవాల్ చేస్తూ పలువురు రాజధాని రైతులు హైకోర్టులో వ్యాజ్యంగా వేయగా.. దానిని విచారించిన హైకోర్టు రాజధాని విషయంలో స్పష్టమైన తీర్పును వెల్లడించింది.

ADVERTISEMENT

‘అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలి. ఆరు నెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలి. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరు. అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదు. అమరావతి నుండి ఏ ఆఫీసులను తరలించకూడదు. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలి’ అని ధర్మాసనం తీర్పును వెల్లడించింది.

ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతి మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో పూర్తిగా డెవలప్ చేసిన ప్లాట్లను ఇవ్వాలంది. రాజధాని అవసరాలకు మినహా వేరే ఇతర ఏ అవసరాలకు ఆ భూములను తనఖా పెట్టడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టంగా తీర్పులో పేర్కొంది.

మొత్తానికి ఓ వైపు కేంద్రం అమరావతినే రాజధానిగా గుర్తించడం, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ పట్టుబిగుస్తుండటం, మీద నుండి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు వైయస్ జగన్ ప్రభుత్వానికి గొంతులో మేకులా తయారయ్యాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ADVERTISEMENT
Latest Stories