సోషల్ మీడియాలోకి మనుషులు ప్రవేశిస్తున్నారా లేదా అదే మనుషుల జీవితాలలోకి ప్రవేశిస్తోందా?అంటే ముందు మనం ప్రవేశించాక అది మన జీవితాలలోకి వచ్చేస్తుంది.
దానిని మనం నియంత్రిస్తున్నామని అనుకుంటాము. కానీ ఒకానొక దశలో అదే మన జీవితాలను నియంత్రిస్తోందని అర్ధమవుతుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది…. అనే విషయం కూడా ఆలస్యంగానే అర్ధమవుతుంది.
ఉదాహరణకు భారత్ మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ ఇద్దరూ సెలబ్రెటీలే. కనుక సోషల్ మీడియాలో ఉన్నారు. నవంబర్ 23న వారి పెళ్ళి జరగాల్సి ఉండగా కొన్ని గంటల ముందు రద్దు అయ్యింది. ‘అది రద్దు కాదు వాయిదా మాత్రమే’ అని వారు నొక్కి చెప్పారు.
కానీ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలైపోయాయి. వాటిని ఖండిస్తూ వారు తమ ఫోటోని పోస్ట్ చేసి ‘తమ జంటకు దిష్టి పెట్టవద్దని’ ఓ ఇమోజీ కూడా పెట్టారు.
కానీ చివరికి ఆ ఊహాగానాలే నిజమయ్యాయి. వారి పెళ్ళి నిజంగానే రద్దయింది. వారిరువురూ తమ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో వేర్వేరుగా పోస్టులు పెట్టి తమ పెళ్ళి రద్దు అయినట్లు తెలియజేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్, ఊహాగానాలతో తమ మనసులు గాయపడుతున్నాయన్నారు. కనుక ఇక్కడితో ఈ అంశంపై ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, తమ ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
వారిని ఆకాశానికి ఎత్తేసిన సోషల్ మీడియాయే వారి వివాహం చెడగొట్టింది కదా? సోషల్ మీడియా వారి జీవితాలను తారుమారు చేసి తీరని అప్రదిష్ట పాలు చేసింది. ఇద్దరికీ, వారి కుటుంబాలకు మనశాంతి లేకుండా కూడా చేసింది.
కనుక ఇంతకాలం సోషల్ మీడియాతో సంతోషం పొందిన వారిరువురూ ఇప్పుడు అదే సోషల్ మీడియాని ‘తమ ప్రైవైసీని గౌరవించాలని వేడుకోవడం’ గమనిస్తే వ్యక్తుల జీవితాలలోకి సోషల్ మీడియాలో ఎంతగా చొచ్చుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.







