యూఏఈకి చెందిన లూలు గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలలో భారీ షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తుంటుంది. అటువంటి ప్రఖ్యాత వ్యాపార సంస్థతో చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని రూ.2,200 కోట్లు పెట్టుబడితో విశాఖలో భారీ హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు భూమి కూడా కేటాయించారు.
కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడుపై కక్షతో ఉండవల్లిలో ప్రజావేదికను కూల్చేసిన్నట్లు, అమరావతిని పాడుబెట్టిన్నట్లు, లూలు గ్రూప్‌ని కూడా వేదించడంతో అది దణ్ణం పెట్టి పారిపోయింది.
అప్పుడే ఈ విషయం తెలుసుకొన్న తమిళనాడు ప్రభుత్వం ఆ సంస్థను ఒప్పించి తమ రాష్ట్రానికి తీసుకుపోయింది. లూలు గ్రూప్ ఆ రాష్ట్రంలో కోయంబత్తూరులో రూ.3,000 కోట్ల పెట్టుబడితో దక్షిణాది రాష్ట్రాలలోనే అతిపెద్ద హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసింది. జూన్ 16న దాని ప్రారంభోత్సవం అయ్యింది. దానిలో ప్రత్యక్షంగా 3,000 మందికి ఉద్యోగాలు లభించగా, పరోక్షంగా అనేక మంది చిరు వ్యాపారులు, రైతులకి, పాడి రైతులకి ఇంకా రవాణా తదితర రంగాలలో ఉన్నవారికి ఉపాధి లభిస్తోంది.
తాజాగా లులూ గ్రూప్ రూ.3,500 కోట్లు పెట్టుబడితో హైదరాబాద్‌లో కూకట్‌పల్లి వద్ద అతిభారీ హైపర్ మార్కెట్ ఏర్పాటుచేసింది. దానికీ నిన్ననే ప్రారంభోత్సవం జరిగింది. దానిలో కూడా ప్రత్యక్షంగా 3,000-4,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా అనేకమందికి ఉపాధి లభిస్తుంది.
నిన్న ప్రారంభోత్సవం సందర్భంగా లూలు గ్రూప్ అధినేత ఏంఏ యూసఫ్ అలీ మాట్లాడుతూ, “నేను తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ను గత ఏడాది దావోస్ సదస్సులో కలిశాను. ఆయన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలను సాధించుకోవడానికి ఎంతగానో కృషి చేస్తుండటం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. తెలంగాణలో వ్యాపారానికి అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ఎంతగానో సహకరించింది. కనుకనే ఇంత తక్కువ సమయంలో దీనిని ఏర్పాటు చేయగలిగాము.
రాబోయే రోజుల్లో మా సంస్థ తెలంగాణలో మినీ షాపింగ్ మాల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి విదేశాలకు చేపలు, మాంసం తదితర ఉత్పత్తులను ఎగుమతి చేస్తాము. స్థానిక రైతులు, వ్యాపారుల నుంచి మేము అనేక ఉత్పత్తులను సేకరిస్తుంటాము కనుక వారికీ ఎంతో మేలు కలుగుతుంది. తెలంగాణలో మా తొలి సంస్థ ఏర్పాటు చేసేందుకు సహకరించిన మంత్రి కేటీఆర్‌గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.
ఇదంతా వింటున్నప్పుడు మన ఆంద్రాకు ఏమైంది?మన గుడివాడ ఏం చేస్తున్నారు?మన గురించి ఏ పారిశ్రామికవేత్త ఇలా రెండు మంచి ముక్కలు మాట్లాడరేమి?అనిపించకమానదు. కానీ “ఏటి సేత్తాం సొమ్ములు పోనాయి మరి…” అని ఓసారి నిట్టూర్చి ఊరుకోవలసిందే.



