సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ వేస్తూ ప్రేక్షకుల దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు నరేష్ మాజీ సతీమణి రమ్య రఘుపతిపై పోలీసు కేసు నమోదైన విషయం తెలిసిందే. నరేశ్ పేరుతో రమ్య డబ్బులు వసూళ్లకు పాల్పడుతోందంటూ కొందరు హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారంపై నరేష్ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేస్తూ వివరణ ఇచ్చుకున్నారు. ఆమెకు తనకు ఎలాంటి సంబంధాలు లేవని, రమ్య జరిపే వ్యాపార, ఆర్థిక లావాదేవీలతో తనకు ఎటువంటి అనుబంధం లేదని స్పష్టం చేశారు. తమ వివాహం తరువాత కూడా ఆమె ఇటువంటి వ్యవహారాలు చేస్తుండడం వలన తమ ఇద్దరి మధ్య మనఃస్పర్థలు రావడంతో ఐదారేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
ఇటువంటి సంఘటనలు మనోవేదనకు గురిచేస్తున్నాయని, ఫిర్యాదు చేసిన వారికి సొమ్ములిచ్చి సర్దుబాటు చేసుకునే యోచనలో రమ్య ఉన్నట్లు తెలిసిందని అన్నారు. రమ్య గురించి మీడియాలో కూడా చాలా వార్తలు వస్తున్నాయని, దీంతో చాలా మంది తనకు ఫోన్ చేశారని, అందుకే తాను ఈ విషయంపై స్పష్టత ఇవ్వదలచుకున్నానని అన్నారు.
రమ్య వ్యాపార లావాదేవీలతో పాటు ఆమెకు ఉన్న అప్పుల సమస్యల గురించి వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇదే విషయమై ఓ మూడు నెలల క్రితం పేపర్‌లో పబ్లిక్ నోటీసు కూడా ఇచ్చానని నరేష్ వివరించారు. ‘మా’ ఎన్నికల సందర్భంలో ఓ రేంజ్ లో హల్చల్ చేసిన నరేష్, ప్రస్తుతం సైలెంట్ అయినట్లుగా కనపడుతున్నారు.



