
ఏపీ, తెలంగాణలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ, వాటి మద్య రాజకీయ బంధాలు మాత్రం చెక్కు చెదరలేదు. పైకి ఏపీ, తెలంగాణ రాజకీయాలు వేర్వేరుగా సాగిపోతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, పరస్పరం తీవ్ర ప్రభావితం చేసుకుంటూనే ఉన్నాయి.
ఇందుకు రెండు చక్కటి ఉదాహరణలు కళ్ళ ముందే ఉన్నాయి. 2019లో ఏపీ ఎన్నికలలో కేసీఆర్ వేలు పెట్టి చంద్రబాబు నాయుడుని గద్దె దించి జగన్‌ని ఆ కుర్చీలో కూర్చోబెట్టగా, 2023 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండటం ద్వారా కేసీఆర్‌ని గద్దె దించి రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చోవడానికి తోడ్పడింది.
Also Read – అది ప్రమాదమట.. కేసు నమోదు చేయడం కుట్రట!
కనుక ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆంధ్రా రాజకీయాలపై ఎంతో కొంత ప్రభావం తప్పక చూపుతాయి. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఇంకా బలహీనపడితే జగన్‌కు కష్టకాలంలో ఆదుకునే పెద్ద దిక్కు లేకుండా పోతుంది.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఇంకా బలహీనపడితే ఆ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపి, టీడీపీలలోకి క్యూ కట్టవచ్చు. తెలంగాణలో బీజేపి, జనసేనలతో కలిసి టీడీపీ పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ కూడా నిలబడలేదు. కనుక తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read – శంకర్ కి సాధ్యం కానిది శేఖర్ కు సాధ్యం..!
ఒకవేళ కల్వకుంట్ల కవిత చెప్పినట్లుగా బీజేపిలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అప్పుడు తెలంగాణ బీజేపికి దూరంగా ఉండిపోక తప్పదు. అదే జరిగితే తెలంగాణతో టీడీపీ మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతుంది. కనుక తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచన టీడీపీ విరమించుకోవలసి వస్తుంది.
అయితే బిఆర్ఎస్ పార్టీలో ఒక్క హరీష్ రావుని ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తే వారిని మాత్రమే చేర్చుకునేందుకు బీజేపి అధిష్టానం ఆసక్తి చూపవచ్చు తప్ప కేసీఆర్, కేటీఆర్, కవితలతో కూడిన బిఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడం అంటే కొరివితో తల గోక్కొన్నట్లే అవుతుంది.
Also Read – యుద్ధాలు చేయకుండా అమెరికా ఉండలేదేమో
కనుక తెలంగాణలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల ప్రభావం ఏపీలో వైసీపీ, కూటమి పార్టీలపై తప్పక ఉంటుంది. అది ఏవిదంగా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.