భారత్-పాక్ మద్య మే 7-10 తేదీలలో జరిగిన యుద్ధంలో కాల్పుల విరమణ తర్వాత పాక్ విజయం సాధించిందని ప్రకటించుకొని సంబరాలు జరుపుకున్నారు. కానీ వాస్తవం ఏమిటో పాక్ ప్రధాని షాహబాజ్ షరీఫ్ స్వయంగా మిత్ర దేశాలైన తుర్కీయే, అజర్ బైజాన్‌లకు చెప్పుకొని వాపోయారు.
ఆపరేషన్ సింధూర్‌కి ధీటుగా మే 10వ తేదీ తెల్లవారుజామున 4.30గంటలకు భారత్‌పై భీకర దాడులు చేయాలని ముందు రోజు రాత్రి నిర్ణయించుకున్నామని, కానీ తాము నిద్ర మేల్కొనేలోగానే భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడి తమ సైనిక, వాయుసేన స్థావరాలని ధ్వంసం చేసిందని చెప్పుకున్నారు.
గత్యంతరంలేని పరిస్థితిలో మిత్రదేశాల ద్వారా కాల్పుల విరమణకి భారత్‌ని ఒప్పించి యుద్ధం నుంచి బయటపడ్డామని పాక్ ప్రధాని షాహబాజ్ షరీఫ్ మిత్ర దేశాలకు చెప్పుకొని వాపోయారు. ఇటీవల అజర్ బైజాన్‌లో జరిగిన మూడు దేశాల సదస్సులో పాక్ ప్రధాని ఈ విషయాలు బయటపెట్టారు.
కానీ కశ్మీర్ సమస్యని శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్దంగా ఉన్నామని పాక్ ప్రధాని షాహబాజ్ షరీఫ్ అన్నారు.
పాక్‌పై భారత్ దాడులు జరుపుతున్నప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ కశ్మీర్, సింధూ జలాల విషయంలో భారత్‌తో రాజీ పడే ప్రసక్తే లేదు. సింధూ జలాలు 24 కోట్ల మంది పాక్ ప్రజల హక్కు. వీటిని కాదనే అధికారం భారత్‌కు లేదు,” అని అన్నారు.
దీనిపై భారత్ కూడా ధీటుగానే స్పందించింది. భారత్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “పాక్‌లో దాగున్న ఉగ్రవాదులను మాకు అప్పగించాలి. అలాగే పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్‌ని కూడా అప్పగించాలి.
భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పాక్ మానుకుంటుందని మాకు నమ్మకం కలగాలి. అంత వరకు పాక్‌తో ఎటువంటి చర్చలు ఉండవు. ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే చోట సాధ్యం కాదనే మా ప్రధాని మోడీ మాటలు పాక్ గుర్తుచేసుకొని తన తీరు మార్చుకుంటే మంచిది,” అని అన్నారు.
భారత్ చేతిలో అనేకసార్లు చావుదెబ్బలు తింటున్నా పాక్ పాలకుల ఆలోచనలు, విధానాలు మారడం లేదు కనుకనే కశ్మీర్ పేరుతో భారత్‌పై దాడులు జరుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మారలేదని పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటి వరకు భారత్‌లో ఉగ్రదాడులు మాత్రమే జరిగాయి. కానీ భారత్ దాడులతో ప్రపంచదేశాలలో పరువు పోగొట్టుకున్న పాక్ ఇప్పుడు దెబ్బ తిన్న పులిలా అదునుకోసం వేచి చూస్తుంది. మారిన పాక్ మళ్ళీ ఏదో రోజు హటాత్తుగా భారత్‌పై భీకర దాడులు చేయడానికే పాక్ ప్రధాని తుర్కీయే, అజర్ బైజాన్ దేశాధినేతలతో సమావేశమై ఉండవచ్చు.కనుక భారత్ మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమే.




