గతంలో ప్రతిపక్ష పార్టీలలో చాలా మంది ప్రధానమంత్రి రేసులో ఉండేవారు కానీ ఈసారి ప్రధానంగా ముగ్గురి పేర్లే వినిపిస్తున్నాయి. 1. తెలంగాణ సిఎం కేసీఆర్, 2. బిహార్ సిఎం నితీశ్ కుమార్, 3. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ. వీరు ముగ్గురూ కాక రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. నలుగురు ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించేశారు.
తెలంగాణ సిఎం కేసీఆర్ ఇప్పటికే తన పోటీదారులు మమతా బెనర్జీ, నితీశ్ కుమార్‌తో సహా ఢిల్లీ, పంజాబ్, జార్ఖండ్, తమిళనాడు, ఒడిశా, కేరళ ముఖ్యమంత్రులు, వివిద రాష్ట్రాలలో బిజెపియేతర పార్టీల నేతలతో భేటీ అయ్యారు. మరోవైపు దేశంలో రైతులను ఏకం చేసి తన సైన్యంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో రైతులందరికీ 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తానని చెప్పారు. తాను ప్రధాన మంత్రి అవడం దేశానికి చాలా అవసరమని టిఆర్ఎస్ నేతలు, మంత్రుల చేత చెప్పిచారు. తద్వారా తాను ప్రధాని రేసులో ఉన్నట్లు పోటీదారులకు విస్పష్టంగా తెలియజేశారు. త్వరలోనే జాతీయ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించడానికి సిద్దం అవుతున్నారు.
బిహార్ సిఎం నితీశ్ కుమార్ ఇటీవలే ఎన్డీయేకి, బిజెపికి కటీఫ్ చెప్పేసి దాణా కుంభకోణం కేసులో జైలులో ఉన్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ సాయంతో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలను, ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. తన నేతృత్వంలో కూటమి ఏర్పాటు చేసి మోడీని గద్దె దించి తాను ఆ కుర్చీలో కూర్చోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే ఆయన పోటీదారు కేసీఆర్ పాట్నా వచ్చినప్పుడు ప్రెస్‌మీట్‌లో ‘కూటమి నాయకత్వం, ప్రధాని పదవి ఇద్దరిలో ఎవరికి?అని ఓ విలేఖరి సూటిగా ప్రశ్నించినప్పుడు ఇద్దరూ చాలా ఇబ్బందిపడ్డారు.
మోడీ-అమిత్ షా, బిజెపిలతో ఎక్కువగా ఇబ్బందిపడిన వ్యక్తులలో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కూడా ఒకరు. ఆమె ప్రభుత్వాన్ని కూల్చాలని విఫలయత్నం చేసిన తర్వాత కనీసం శాసనసభ ఎన్నికలలోనైనా ఆమెను ఓడించి గద్దె దించి ఆమె కోటపై కాషాయజెండా ఎగురవేయాలని బిజెపి (కేంద్ర ప్రభుత్వం) గట్టిగా ప్రయత్నించింది కానీ విఫలమైంది. కనుక ఆమె పగబట్టిన సివంగిలా మోడీ-అమిత్ షాలను దెబ్బ తీసేందుకు ఎదురుచూస్తున్నారు. ఆమె నిన్న కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ, “మోడీని గద్దె దించేందుకు దేశంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. 2024లో అసలైన ఆట ఇక్కడి నుంచే మొదలవుతుంది,” అని అన్నారు. అంటే ప్రతిపక్ష కూటమికి తానే నాయకత్వం వహించాలనుకొంటున్నట్లు చెప్పినట్లే.
ఇక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కానీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాళ్ళు ఆరిపోయేలా పాదయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ సొంత బలంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినా లేదా మిత్రాపక్షాలతో కలిసి వచ్చినా ప్రధాన మంత్రి పదవి తనకే అని గట్టిగా నమ్ముతున్నారు.
ఈ నలుగురిలో ఎవరికీ ఆ కుర్చీ దక్కుతుంది?అంటే ఎవరికీ దక్కదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరూ మరొకరి నాయకత్వాన్ని అంగీకరించే స్థితిలో లేరు. ప్రధాని పదవికి తామే సరైన వ్యక్తులమని తమ పార్టీ నేతల చేత చెప్పించుకొంటున్నారు. ఇటువంటి పదవీలాలస కారణంగానే గతంలో కూటమి ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడూ అదే జరుగుతుంది. అయితే బిజెపిలో తదుపరి ప్రధాని ఎవరు?అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కనుక మోడీ నాయకత్వంలో సమిష్టిగా పనిచేసి ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది.



