‘రివ్యూ’లను వినియోగించుకోవడంలో ఆసీస్ సారధి ఎంత నేర్పుగా వ్యవహరిస్తున్నారో నాలుగవ రోజు ఆటలోని తొలి సెషన్ ను చూస్తే అర్ధమవుతుంది. ఆవేశంలో, తొందరపాటుతో ‘రివ్యూ’లను కోరే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఖచ్చితంగా స్మిత్ ను చూసి నేర్చుకోవాలనిపించే విధంగా ‘రివ్యూ’లను ఆశ్రయిస్తున్నాడు. పిచ్ చేస్తోన్న మాయలలో భాగంగా, మైదానంలో అనేక సార్లు బౌలర్లు ‘ఎల్బీడబ్ల్యూ’ల కోసం ఎంపైర్ ల ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆ క్రమంలోనే క్రీజులో పాతుకుని ఉన్న అజెంకా రెహనే ‘అవుట్’ అంటూ ఆసీస్ రివ్యూ కోరింది.
కొత్త బంతిని తీసుకుని తన బాధ్యతలను అప్పగించిన కెప్టెన్ స్మిత్ ఆశలను నిలబెడుతూ స్టార్క్ బౌలింగ్ చేసాడు. ఎంపైర్ నాటౌట్ ఇచ్చినప్పటికీ, కెప్టెన్ స్మిత్ రెహనే అవుట్ పైకి రివ్యూకు వెళ్ళడం, రివ్యూలో అవుట్ గా తేలడంతో టీమిండియా పతనం ప్రారంభమైంది. అప్పటివరకు 238/4గా ఉన్న స్కోర్ బోర్డు, మరో రెండు ఓవర్లు ముగిసే సమయానికి 246/8గా మారిపోయింది. స్టార్క్ వేసిన ఓవర్ లో రెహనే, కరుణ నాయర్ లు అవుట్ కాగా, ఆ తర్వాత ఓవర్ లో పుజారా, అశ్విన్ లు పెవిలియన్ కు చేరుకున్నారు.
దీంతో స్మిత్ తీసుకున్న ‘రివ్యూ’తో సీన్ మొత్తం మారిపోయి, అప్పటివరకు పటిష్ట స్థితిలో ఉన్న భారత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సెంచరీకి చేరువలో వచ్చిన పుజారా 92 పరుగుల వద్ద వెనుదిరగగా, చివరి వికెట్ కు ఇషాంత్ శర్మ కాసేపు పోరాటపటిమను ప్రదర్శించడంతో, టీమిండియా 274 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్ లక్ష్యం 188 పరుగులుగా నిర్దేశం అయ్యింది. అయితే కట్టుదిట్టమైన బౌలింగ్, అలాగే వచ్చిన క్యాచ్ లను అందుకుంటూ మంచి ఫీల్డింగ్ చేస్తే ఈ మ్యాచ్ లో భారత్ కు విజయ అవకాశాలు కూడా ఉన్నాయి. పిచ్ తన వంతు సాయం చేస్తోంది గనుక, సరైన ఏరియాలలో బంతులను వేయాల్సిన బాధ్యత బౌలర్లపై ఉంది.



