దుబాయ్‌లో నేడు మరో ఆపరేషన్ సింధూర్?

India Pakistan Dubai Match

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్‌-పాక్ మద్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పాకిస్తాన్‌కు బాసటగా నిలబడి ఆ దేశాన్ని కాపాడారని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి 8 గంటలకు దుబాయ్‌లో భారత్‌-పాక్ మద్య ఆసియా కప్ 2025 మ్యాచ్ జరుగబోతోంది.

సాధారణ పరిస్థితులలో భారత్‌-పాక్ మ్యాచ్ కోసం ఇరుదేశాల ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తారు. ప్రతీ మ్యాచ్ ప్రత్యక్ష యుద్ధమే అన్నంత ఉద్రిక్తంగా సాగుతుంది. కనుక భారత్‌-పాక్ పోరు ఎప్పుడూ ఫేవరెట్ ఈవెంట్‌గా నిలుస్తుంది.

ADVERTISEMENT

కానీ పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌ జరిగినప్పటికీ, అటువంటి దేశంతో మళ్ళీ క్రికెట్ ఆడటం సిగ్గుచేటని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో #బాయ్‌కాట్ ఇండియా-పాక్ మ్యాచ్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ప్రధాని మోడీ, పాక్‌పై బ్రహ్మాస్త్రం సందించిన తర్వాత ఎందుకు మెత్తబడిపోయారు? ఈ మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐని ఎందుకు అనుమతించారు?

చైనా ఒత్తిడి ఉందా? లేదా మళ్ళీ పాక్‌కి స్నేహహస్తం అందించాలనుకుంటున్నారా? లేక బీహార్‌ ఎన్నికలలో లబ్ధి పొందేందుకా? అనుమానాలు రేకెత్తుతున్నాయి. కానీ సమాధానం లేదు.

భారత్ సరే! మరి పాక్ క్రికెట్ బోర్డుని ఆ దేశ పాలకులు ఎందుకు అనుమతించారు? అంటే సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

భారత్‌తో చేసిన అనేక ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలలో ఓడిపోయిన పాక్, కనీసం ఈ క్రికెట్ పోరులో విజయం సాధించి ఆ అవమానాలకు ముఖ్యంగా అపరేషన్ సింధూర్‌కి ప్రతీకారం తీర్చుకోవాలని భావించడం చాలా సహజం. పాక్ ఆటగాళ్ళు ఆ లక్ష్యంతోనే బరిలో దిగుతారు. కనుక వారిని ఎదుర్కోవడం భారత్‌ ఆటగాళ్ళకు మరింత కష్టం కావచ్చు.

అలాగని పాక్ ఆటగాళ్ళు భారత్‌ని తక్కువ అంచనా వేయడం లేదు. ఇటువంటి మ్యాచ్‌లలో భారత్‌ని ఓడించడం చాలా కష్టమని వాళ్ళకు బాగా తెలుసు. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ చేతిలో పాక్ ఓడిపోతే తమ దేశం పరువు పోతుందని వారికి బాగా తెలుసు.

ఇక భారత్‌ ఆటగాళ్ళ విషయానికి వస్తే, ఎట్టి పరిస్థితులలో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ని ఓడించి మరోసారి తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

కనుక నేడు జరుగబోయే ఈ మ్యాచ్ కేవలం ఆసియా కప్ ట్రోఫీ కోసమే కాదు. ఇరుదేశాల ప్రతిష్ట, ప్రతీకారాలకు దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మరో మినీ యుద్ధంగా కూడా భావించవచ్చు.

అందువల్లే ఓ పక్క ‘బాయ్‌కాట్’ అంటున్నా ఎప్పటిలాగే ఈసారి కూడా భారత్-పాక్ మద్య జరుగబోతున్న ఈ మ్యాచ్‌ కోసం ఇరుదేశాల ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories