భారత్‌లో ఆల్ ఈజ్ వెల్… కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో

India vs Pakistan: Why India Stays Stable and Grows

భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్.. మూడు దేశాలలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మూడు దేశాలలో ఒక్క భారత్‌ మాత్రమే నిలకడగా అభివృద్ధి సాధిస్తుండగా పాక్‌, బంగ్లాదేశ్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. ఎందువల్ల? అంటే..

భారత్‌లో ప్రధాని మొదలు ముఖ్యమంత్రుల వరకు ఎవరినైనా ఎన్ని మాటలైనా అనొచ్చు. దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బలంగా ఉండటమే దీనికి కారణమనుకోవచ్చు.

ADVERTISEMENT

అలాగే భారత్‌లో పాలకులు అసమర్ధ పాలన సాగించినా, తప్పుడు నిర్ణయాలతో దేశానికి, రాష్ట్రాలకు, ప్రజలకు కష్టనష్టాలు కలిగించినా ఎవరికీ జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

అలాగే పాలకులు అవినీతికి పాల్పడుతూ వేలకోట్లు దోచుకున్నా ప్రజలు మళ్ళీ మళ్ళీ వారినే మార్చి మార్చి ఎన్నుకుంటూ అధికారం కట్టబెడుతుంటారు. ఇలాంటి పరిస్థితులలో కూడా భారత్‌ బాగానే అభివృద్ధి చెందింది. దేశంలో రాజకీయ సుస్తితరత నెలకొని ఉంటుంది.

కానీ అదే పాకిస్తాన్‌లో ఒక్క అభివృద్ధి విషయంలో తప్ప మిగిలినవన్నీ కామన్. అక్కడ పదవి, అధికారం చేతిలో ఉన్నంతవరకే ప్రధానమంత్రి, సైన్యాధ్యక్షులు సేఫ్. అవి పోగానే తక్షణం దేశం విడిచి పారిపోవాల్సిందే. లేకుంటే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లా జైల్లో మగ్గాల్సి ఉంటుంది. లేదా ఉరి కంబం ఎక్కాల్సి ఉంటుంది. లేదా ఎవరో దాడి చేసి చంపేసినా ఆశ్చర్యం లేదు. కనుక ఎక్కువ మంది అయిన కాడికి దోచుకొని విదేశాలకు జంప్ అయిపోతుంటారు.

బంగ్లాదేశ్‌లో కూడా ఒక్క అభివృద్ధిలో తప్ప మిగిలినవన్నీ సేమ్‌ టూ సేమ్‌. ఇందుకు చక్కటి ఉదాహరణ.. అక్కడ తిరుగుబాటు జరిగినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మన దేశానికి పారిపోయి వచ్చిన మాజీ ప్రధాని షేక్ హసీనా! ఆమె భారత్‌లో ఆశ్రయం పొంది రెండేళ్ళుగా ఇక్కడే ఉంటున్నారు.

ఆమెని తమకు అప్పగించాలని లేకుంటే భారత్‌తో యుద్ధానికి సిద్దమని బంగ్లా తిరుగుబాటు నేతలు, కొందరు పాలకులు బెదిరించారు. కానీ తమ తాటాకు చప్పుళ్ళకు భారత్‌ భయపడదని వారికీ తెలుసు. ఇక చేసేదేమీ లేక ఊరుకున్నారు.

భారత్‌లో ఆశ్రయం పొందిన షేక్ హసీనా ఇప్పుడు స్వదేశానికి వెళ్ళిపోవాలనుకున్నట్లు చెప్పారు. అక్కడకు వెళ్ళగానే తనని అరెస్ట్ చేసినా ఉరి తీసినా ఆశ్చర్యం లేదని అందుకు తాను సిద్దపడే వెళ్తున్నానని అన్నారు.

ఇదీ… మూడు దేశాలలో రాజకీయాలు, పాలకుల పరిస్థితి. మరి భారత్‌ మాత్రమే ఏవిధంగా అభివృద్ధి చెందుతోంది? అంటే దేశంలో ఎన్ని రాజకీయాలు జరుగుతున్నప్పటికీ సైన్యం దూరంగా ఉంటుంది, ఎన్నడూ జోక్యం చేసుకోదు. ముఖ్యంగా ఏ పార్టీ, కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వానికి త్రివిధ దళాలు విధేయంగా ఉంటాయి. దాని ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాయి.

అలాగే భారత్‌లో న్యాయ, ప్రజాస్వామ్య వ్యవస్థలు అప్పుడప్పుడు కొరడా ఝళిపిస్తుంటాయి. ఇదీ ఓ బలమైన కారణమే.

భారత్‌లో 140 కోట్లకి పైగా జనాభా కలిగి ఉండటం అభివృద్ధికి అవరోధంగా అనుకునేవారు. కానీ ఇప్పుడా ధోరణి సమూలంగా మారింది. ప్రపంచంలో ఇన్ని కోట్లమంది వినియోగదారులున్న అతిపెద్ద మార్కెట్ భారత్‌ అని ఇప్పుడు అందరూ గుర్తించి పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. కనుక రాజకీయాలకు అతీతంగా దేశంలో అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఇలాంటి పలు కారణాలు భారత్‌ని ఆ రెండు దేశాల కంటే ఉన్నతంగా నిలబెడుతున్నాయని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories