ఇండిగోలు ఇంత ఆలస్యం దేనికంటే…

దేశవ్యాప్తంగా నేడు 92 విమానాలు రద్దు అయ్యాయి. దీంతో విమానాశ్రయాలలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇండిగో సిబ్బందిపై విరుచుకుపడుతున్నారు. ఈ ఆలస్యానికి సాంకేతిక సమస్యలు కారణం కాదు. ఉద్యోగుల వారాంతపు సెలవు మార్పిడి విషయంలో డిజిసిఏ జారీ చేసిన తాజా ఉత్తర్వులే.

పైలట్ల కొరత వలన దేశంలో చాలా విమానయాన సంస్థలు ఉన్నవారితోనే అదనపు గంటలు పనిచేయిస్తూ విమానాలు నడిపిస్తుంటాయి. కారు, బస్సు డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకుండా నడిపితేనే పెను ప్రమాదాలు సంభవిస్తుంటాయి. విమానాలకైతే ఈ ప్రమాద తీవ్రత, ప్రభావం, నష్టం మరిన్ని రెట్లు ఉంటుంది.

ADVERTISEMENT

కనుక వారాంతపు సెలవు మార్పిడి విషయంలో డిజిసిఏ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రభావం మొట్ట మొదట పైలట్ల కొరతతో బాధపడుతున్న ఇండిగో సంస్థపైనే పడింది. దీంతో అనేక విమానాలు రద్దు చేసుకోవలసి వచ్చింది.

దేశంలో విమానయాన సంస్థలలో ఇండిగో ప్రయాణికుల వాటా దాదాపు 60 శాతం ఉంది. అంతర్జాతీయ విమాన సేవలు కూడా అందిస్తోంది. డజన్ల కొద్దీ విమానాలు రద్దు అవడంతో ప్రయాణికులు ఎలాగూ ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇండిగో సంస్థ కూడా ఆర్ధికంగా చాలా నష్టపోతోంది.

ఈ సమస్య తీవ్రతని గ్రహించిన డిజిసిఏ వారాంతపు సెలవు మార్పిడి విషయంలో జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉప సంహరించుకుంటూ కొద్ది సేపటి క్రితమే మరో ఉత్తర్వు జారీ చేసింది.

కనుక మరికొన్ని గంటలలో లేదా రేపటి నుంచి మళ్ళీ యధాప్రకారం సమయానికే ఇండిగో విమానాలు రాకపోకలు సాగవచ్చు.

కానీ ఈ ఉత్తర్వులతో ఏర్పడిన ఈ సమస్య దేశంలో పైలట్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో తేటతెల్లం చేసింది.

కరోనా మహమ్మారి దేశంపై విరుచుకు పడినప్పుడు వైద్యులు, వైద్య సిబ్బంది, ఆస్పత్రుల కొరత ఎంతగా ఉందో కళ్ళకు కట్టిన్నట్లు చూపింది. అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని దేశవ్యాప్తంగా కొత్తగా వందలాది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటిలో వేల మంది వైద్యులు, నర్సులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చి అందుబాటులోకి తెస్తున్నాయి.

అదేవిధంగా ఇప్పుడు పైలట్లు, విమాన సిబ్బంది కొరతని అధిగమించేందుకు కూడా పైలట్, ఎయిర్ హాస్టస్‌, గ్రౌండ్ స్టాఫ్, ఏటీసీ సిబ్బందిని తయారు చేసుకోవడానికి ఎక్కడికక్కడ శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయడం చాలా అవసరం.

Indigo Flights

ADVERTISEMENT
Latest Stories