అధికార పార్టీ ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు సన్నాహాలు చేసుకోవడం సహజమే కానీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే సన్నాహాలు ప్రారంభించడమే చాలా విడ్డూరం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా అదే చేస్తోంది. అయితే దానికి ఇద్దరు శల్యసారధ్యం చేస్తున్నారు. 1 సజ్జల రామకృష్ణారెడ్డి. 2. ఐప్యాక్.
గత ఎన్నికలలో ‘అన్నీ కలిసి రావడంతో’ ఐప్యాక్ వ్యూహాలు కూడా ఫలించి వైసీపీ ఎన్నికలలో గెలిచింది. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదనుకోలేము. కానీ వైసీపీ గెలుపుకి ఐప్యాక్ కూడా చాలా తోడ్పడింది కనుక అది చెప్పిందే వేదం అన్నట్లు పాలన సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక వివేకా హత్య కేసులో లాయర్ల కంటే అద్భుతంగా వాదిస్తూ బోడి గుండుకీ, మోకాలుతో మూడేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన ఆజ్ఞ లేనిదే తాడేపల్లిలో చీమ కూడా చిటుక్కుమనదని పార్టీని వీడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. కనుక వీరి సారధ్యంలోనే వైసీపీ మూడడుగులు ముందుకి, ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగిపోతోంది. ముందుకు వెనక్కు ఎందుకంటే 175 సీట్లు వైసీపీకే అనుకొన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో, ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి ఉండాలి. కానీ వైసీపీకే చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఒకేసారి క్లీన్ స్వీప్ చేసేసుకొంది.
ఇంటింటికీ జగన్ స్టిక్కర్, వైనాట్ 175, వై ఏపీ నీడ్స్ జగన్ వంటి చిత్రవిచిత్రమైన ఆలోచనలన్నీ వీరి మెదడులో నుంచి ఉద్భవించినవే అని వేరే చెప్పక్కరలేదు. .
గడప గడపకి, స్టిక్కర్స్ కార్యక్రమాలలో ప్రజల చేత ఛీ కొట్టించుకొన్నా, జనాల శాపనార్ధాలే మాకు దీవెనలు అని నమ్మబలకడం వైసీపీకే చెల్లు. ఆ రెండు కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని చెప్పుకొని స్వీట్లు కూడా పంచుకొన్నారు కనుక ఇప్పుడు వైసీపీ నేతల కోసం ఐప్యాక్ మరో కార్యక్రమం సిద్దం చేసింది.
అదే… బస్సు యాత్రలు. ప్రతీ జిల్లా అధ్యక్షుడు నేతృత్వంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ బస్సు యాత్రలలో పాల్గొనవలసి ఉంటుంది. ఆయా మండలలోని క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి వారికి ఐప్యాక్ నివేదికలు అందజేస్తుంది. వాటి ఆధారంగా వైసీపీ నేతలు వై ఏపీ నీడ్స్ జగన్? (ఏపీకి జగన్ ఎందుకు అవసరం?) అని ప్రజలకు నచ్చజెప్పుకోవలసి ఉంటుంది.
సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు లేదా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేవరకు అందరూ బస్సులో తిరుగుతూ ప్రజల మద్యనే ఉండాలని ఐప్యాక్ ఆదేశం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు కూడా బస్సులు ఎక్కుతారు.
ఈ కార్యక్రమంపై టిడిపి నేతలు అప్పుడే తమదైన శైలిలో స్పందిస్తున్నారు. గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనకపోతే టికెట్స్ ఇవ్వబోనని జగన్ పదేపదే హెచ్చరిస్తున్నా చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు దానిలో పాల్గొనలేదు. ఇప్పుడు వారందరినీ బలవంతంగా బస్సులలో ఎక్కిస్తే వారు తమ ఇసుక, మట్టి, మద్యం వ్యాపారాలు మానుకొని తిరుగుతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి జగన్ ఎందుకు అవసరం?అని వైసీపీ నేతలే ప్రజలను అడుగుతున్నప్పుడు వారు కూడా అవసరమా? అని అడగకుండా ఉంటారా?అని వ్యంగ్యంగా చురకలు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు వస్తున్న ప్రజాధరణని చూసి సిఎం జగన్మోహన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని అందుకే ఇప్పుడు పార్టీలో నాయకులందరి చేతబలవంతంగా బస్సుయాత్రలు చేయిస్తున్నారని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.



