కవిత తిరిగి పుట్టింటికి రానుందా.?

Is Kavitha Returning to BRS?

కవిత రాజకీయ ప్రయాణం గతి తప్పిందా.? గులాబీ కారు నుంచి జాగృతి కార్యాలయం వైపు వేగంగా అడుగులేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన గమ్యాన్ని మార్చుకుని తిరిగి సొంత గూటికి చేరుకోనుందా.?

అవును, తాజాగా కవిత తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ను పరిశీలిస్తే ఈ వ్యాఖ్యలు నిజమనే భావించాల్సి ఉంటుంది. తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ తో కవిత రాజకీయం దారి తప్పిందా అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో మొదలయ్యింది.

ADVERTISEMENT

లేఖ తో బిఆర్ఎస్ లో మొదలైన కవిత రచ్చ చివరికి టీవీ 5 వరకు చేరడంతో బిఆర్ఎస్ లో మొదలైన అంతర్గత ఇంటి పోరు మీడియాకెక్కింది. ఇక కేసీఆర్ లాంటి దేవుడు చుట్టూ దెయ్యాలున్నాయి, అవి నన్ను కేసీఆర్ కు దూరం చెయ్యాలని చూస్తున్నాయి,

కేసీఆర్ ను తప్ప నేనెవరిని నా నాయకుడిగా అంగీకరించబోను అంటూ కవిత ఇచ్చిన ఘాటు ప్రకటనలు కవిత కు బిఆర్ఎస్ కు మధ్య ఏర్పడిన దూరాన్ని స్పష్టం చేసాయి. అలాగే తీన్మార్ మల్లన్న కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యల పై అటు బిఆర్ఎస్ నుంచి కానీ కేసీఆర్ కుటుంబం నుంచి కానీ ఎటువంటి స్పందన రాకపోవడం,

ఆ వ్యాఖ్యల వెనుక బిఆర్ఎస్ ముఖ్య నాయకుల హస్తం ఉందంటూ కవిత ఆరోపించడం, బీజేపీలో బిఆర్ఎస్ విలీనం పై కవిత తరుచు వ్యాఖ్యానించడం, రాఖీ పండుగ సందర్భంగా కూడా కవిత, కేటీఆర్ కు రాఖీ కట్టకపోవడం ఈ పరిణామాలన్నీ కూడా కవితను పూర్తిగా బిఆర్ఎస్ పక్కన పెట్టిందా.? అన్న సందేహాలను తెచ్చిపెట్టాయి.

అలాగే ఇటు కవిత కూడా గులాబీ జెండా కు బదులు జాగృతి కండువాలతో రాజకీయం నడపడం, బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జాగృతిని పెంచాలని భావించడం తో కవిత కూడా షర్మిల మాదిరి సొంత కుంపటి కి సిద్దమయ్యారా.? అన్న అనేక ప్రశ్నలు, ఎన్నో కథనాలు
రాజకీయ వేదికల మీద ప్రత్యక్షమయ్యాయి.

ఇటువంటి సమయంలో కవిత బిఆర్ఎస్ కు తనకు మధ్య ఏర్పడిన గ్యాప్ ను తగ్గించేలా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎవరి రాజకీయ పార్టీలో అయినా ఆయా పార్టీల నాయకుల మధ్య అభిప్రాయం బేధాలు ఉండడం సహజమే. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయాలను ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యతిరేకించడం లేదా.?

బీజేపీ వంటి జాతీయ పార్టీలో సైతం బండి సంజయ్, ఈటెల మధ్య పరస్పర పరోక్ష పోరు బయటపడలేదా.? అలాగే బిఆర్ఎస్ లో కూడా నాకు ఆ పార్టీ నాయకులకు మధ్య అభిప్రాయం బేధాలు తలెత్తాయి అంటూ తానూ ఎప్పటికైనా గులాబీ మొక్కనే అంటూ పరోక్ష సంకేతాలు పంపారు.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ మరోసారి బిఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు కవిత. రాష్ట్ర అస్తిత్వ చిహ్నమైన బతుకమ్మను వేరు చేసి రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో గాంధీ భవన్ కు సాగనంపుతాం అంటూ ట్వీట్ చేసారు.

తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రేవంత్ సర్కార్ కాంగ్రెస్ తల్లిని తెచ్చి అరాచకంగా ప్రజల పై రుద్దే ప్రయత్నం చేస్తుందని, ఆ చర్యలను తానూ ఖండిస్తున్నట్టు తెలిపిన కవిత త్వరలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, మా ప్రభుత్వంలో ఈ విగ్రహాలన్నీ తిరిగి గాంధీ భవన్ కు చేరడం ఖాయమని చెప్పడంతో తానూ ఇప్పటికి బిఆర్ఎస్ నాయకురాలినే, కేసీఆర్ సైన్యాన్ని అని చెప్పకనే చెప్పారు కవిత.

అయితే ఇన్నాళ్లు బిఆర్ఎస్ పేరు పలకడానికి కూడా ఆలోచించిన కవిత నేడు బిఆర్ఎస్ ప్రభుత్వం అంటూ సంబోధించడం తో కవిత తిరిగి తన సొంత గూటికి చేరుకోనుందా.? అన్న ప్రశ్న ఉత్మన్నమవుతుంది. అయితే ఇందుకు పార్టీ అధినేతగా కేసీఆర్, పార్టీ భవిష్యత్ నాయకుడిగా కేటీఆర్ లు సమ్మతిస్తారా.?

ఎదో నాటికి నేను సీఎం ను అయ్యి తీరుతా అంటూ కవిత చేసిన ప్రకటనలు, చెప్పించుకున్న చిలక జోస్యాలు, కవిత వెనుక జరుగుతున్న సీఎం సీఎం నినాదాల రాజకీయం కేటీఆర్ కు ఎప్పటికైనా పక్కలో బల్లెం మాదిరి గుచ్చుకునే ప్రమాదం ఉండడంతో కేటీఆర్, కవిత ఆగమనాన్ని స్వాగతిస్తారా.? అన్న అనుమానాలు లేకపోలేదు.

ADVERTISEMENT
Latest Stories