తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి ఈరోజు అమరావతికి వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిశారు. హైదరాబాద్ నుంచి మర్యాదపూర్వకంగా కలిసేందుకే వచ్చామని చెపితే అంతకంటే పెద్ద జోక్ ఉండదు.
మొదట తెలంగాణ టీడీపీతోనే నాగం జనార్ధన్ రెడ్డి రాజకీయాలలోకి ప్రవేశించారు. మంత్రి పదవి కూడా చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ బలహీనపడటంతో తెలంగాణ నగారా సమితిని స్థాపించారు. కానీ మర్రి చెట్టు నీడన మరే మొక్కలు పెరగవన్నట్లు కేసీఆర్-బిఆర్ఎస్ పార్టీ నీడలో మరే పార్టీ మనుగడ సాగించలేదు కనుక ఆయన కూడా గత ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీ చేరిపోయారు.
కానీ టీడీపీ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ వెలుగు వెలిగారు. నేటికీ ఆ పార్టీలో మంచి ప్రాధాన్యత కలిగి ఉన్నారు. కానీ నాగం జనార్ధన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో గుర్తింపుకి నోచుకోలేదు.
తెలంగాణలో ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ బలహీనపడినందున, ఆ రాష్ట్రంలో మళ్ళీ టీడీపీని బలోపేతం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఒకవేళ ఆయన టీడీపీని బలోపేతం చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్న టీడీపీ నేతలు టీడీపీ గూటికి చేరుకునేందుకు సిద్దంగా ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
అవి నిజమేనని నాగం జనార్ధన్ రెడ్డి అమరావతికి వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుని కలవడంతో స్పష్టమైంది. నాగం ఇంత దూరం వచ్చారు కనుక ఆయన టీడీపీలో చేరడం ఖాయమే. కానీ ఆయన తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు మనసులో ఆ పదవికి మరెవరైనా ఉన్నారా లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.




