ఏపీలో టిడిపి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ముందుగా తెలంగాణ గురించి చెప్పుకుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్ని సవాళ్ళు, సమస్యలు ఎదురవుతున్నా డిసెంబర్ 7నాటికి ఏడాది పాలన పూర్తి చేసుకోగలిగింది.
పదేళ్ళు అధికారం కోసం చకోర పక్షుల్లా ఎదురుచూసిన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు రావడమే కాకుండా, ఏడాది పాలన కూడా పూర్తిచేసుకుంటున్నారు. కనుక ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా గొప్ప విషయమే. కనుక డిసెంబర్ 7 నుంచి 9వరకు సంబరాలు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే… శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓటములతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులతో బిఆర్ఎస్ పార్టీ చాలా ఢీలా పడిపోయింది. ఓ పక్క పార్టీ ఎన్ని సమస్యలలో చిక్కుకుంటున్నా కేసీఆర్ ఫామ్‌హౌస్ వదిలి బయటకు రాకపోవడంతో పార్టీ శ్రేణులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అనేక కేసులు సిద్దం చేసి కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనుక ఏవిదంగా చూసిన బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
కానీ నిజంగా ఉందా?అంటే కేటీఆర్, హరీష్ రావుల దూకుడు చూస్తే లేదనిపిస్తుంది. కేసీఆర్ లేకపోయినా ఇద్దరూ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా ధీటుగా ఎదుర్కొంటూ ముప్పతిప్పలు పెడుతున్నారు. హైడ్రా, మూసీ, తాజాగా లగచర్ల భూసేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టగలిగారు. నిజానికి ఈ మూడు అంశాలలో రేవంత్ రెడ్డి దూకుడే వారికి ఎంతగానో తోడ్పడిందని చెప్పవచ్చు.
బిఆర్ఎస్ పార్టీ ఇక భూస్థాపితమే అనుకునే స్థాయి నుంచి కేవలం 12 నెలల్లోనే అదీ… కేసీఆర్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఇంతగా బలపడి నిలబడటం మామూలు విషయం కాదు. బహుశః ఇది నిరూపించడానికే కేసీఆర్ దూరంగా ఉన్నారేమో? కేసీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ సద్వినియోగం చేసుకున్నారనే చెప్పొచ్చు.
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తే బిఆర్ఎస్ పార్టీ మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీయే తాము సరైన దిశలో ప్రయాణిస్తున్నామో లేదో ఆలోచించుకోవలసి ఉంటుంది.
కేటీఆర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి ఇంకా నాలుగేళ్ళ సమయం మాత్రమే మిగిలి ఉందని గుర్తుంచుకుంటే మంచిది. తర్వాత మేమే వస్తాము,” అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గడువు 4 ఏళ్ళు మాత్రమే మిగిలి ఉందని కనుక మేలుకోమని కేటీఆర్ చేసిన హెచ్చరికని విస్మరిస్తే చివరికి అదే నిజం అవుతుంది.




