తెలంగాణలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కడం సహజమే. కానీ ఏపీలో ఎన్నికలకు ఇంకో ఆరేడు నెలలపైనే సమయం ఉంది అయినా తెలంగాణ కంటే ఏపీలోనేరాజకీయ వాతావరణం వేడెక్కి ఉంది. కారణం అందరికీ తెలిసిందే.
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడమే. ఆ పార్టీలో మిగిలిన ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తామని వైసీపి మంత్రులు హెచ్చరిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీని ద్వారా వైసీపి అధినేత జగన్ లక్షాలు సాధించాలనుకొంటున్నట్లు వైసీపి మంత్రుల మాటలతోనే స్పష్టం అవుతోంది.
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపిని నాశనం చేసి ఎన్నికలలో ఎదురే లేకుండా చేసుకోవడం.
2. ఎన్నికలు దగ్గర పడే సమయానికి చంద్రబాబు నాయుడుతో సహా ముఖ్య నేతలందరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైళ్ళకు పంపించడం ద్వారా వారందరికీ అవినీతి మరకలు అంటించి ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టడం. అలాగే వారిపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం.
3. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఇద్దరూ ప్రజల మద్య తిరుగుతున్నంత కాలం టిడిపి ఇంకా ఇంకా బలపడుతూనే ఉంటుంది. కనుక ఏదో విదంగా వారిని లోపల వేసి టిడిపిని రాజకీయంగా బలహీనపరచడం.
4. వైసీపి ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా జీతాల చెల్లింపులో ఆలస్యం, ప్రభుత్వోద్యోగుల ఆందోళనలు, ఇంకా అనేక సమస్యల నుంచి ప్రజలందరి దృష్టి మళ్ళించడం. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పటి నుంచి టిడిపి, జనసేనలు కూడా ఈ మాయలో కొట్టుకుపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక సామాన్య ప్రజలు ఇందుకు అతీతులు కారు. కనుక చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్రంలో సమస్యల గురించి ఎవరూ ఆలోచించకుండా చేయడంలో వైసీపి ప్రభుత్వం సఫలమైందనే చెప్పాలి.
5. చంద్రబాబు నాయుడునే అరెస్ట్ చేయగలిగినప్పుడు, టిడిపి, జనసేన పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఎవరినైనా అరెస్ట్ చేయగలమనే భయం పుట్టించడం.