తెలంగాణ రాజకీయాలలో మరోకొత్త పార్టీకి చోటుందా.? ఉంటే ఆ చోటును ఏ నినాదంతో నింపబోతున్నారు.? కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ అనే నినాదంతో తెలంగాణ రాజకీయాలకు తెరాస ను పరిచయం చేసారు. అయితే ఇప్పుడు ఆ నినాదం ఎత్తుకున్న తెరాస యే బిఆర్ఎస్ గా మారిపోయింది.
కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ప్రాంతీయవాదం అనే నినాదం దాదాపుగా సమాదైపోయింది. ఇక కుల రాజకీయాలతో కవిత కొత్త పార్టీ ఉండబోతుందా అంటే నిన్న మొన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న కవిత దశాబ్దకాలం పాటు నోరెత్తలేని ఈ సామజిక న్యాయం మీద నేడు కథం తొక్కితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా.?
అందునా ఈ కుల రాజకీయాలను అటు కాంగ్రెస్ పార్టీ కూడా రిజర్వేషన్లతో తమ వైపుకు తిప్పుకుంది. అలాగే బీసీ నినాదం తో ఇప్పటికే తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజకీయంలోకి ఒక కుల ఆధారిత రాజకీయ పార్టీని పరిచయం చేసేసారు. దీనితో కవిత కు ఆ అంశంలో కూడా నో ఛాన్స్.
ఇక ప్రభుత్వ వ్యతిరేకతను కాష్ చేసుకోవడంలో అయినా కవిత జాగృతి ముందుంటుందా అంటే అందుకు ఆమె తండ్రి కేసీఆర్ పార్టీ బిఆర్ఎస్ కవితను ఎదగనిస్తుందా.? బిఆర్ఎస్ ను కాదని కేసీఆర్ ని వద్దనుకుని కేటీఆర్ ని తొక్కేసి కవితను తెలంగాణ రాజకీయం ఆహ్వానిస్తుందా.? అది సాధ్యమయ్యే పనేనా.?
రాజకీయంలో తలలు పండిన కేసీఆర్, చంద్రబాబు నాయుడు లాంటి వారే కొన్ని కొన్ని సందర్భాలలో బీజేపీ రాజకీయం ముందు తలవంచక తప్పని పరిస్థితి ఉంటుంది. అలాగే ఆర్థికంగా బలంగా ఉన్న వైసీపీ పార్టీ సైతం బీజేపీ రాజకీయం ముందు మెడలు వంచాల్సిందే అన్నట్టుగా బీజేపీ రాజకీయం ఎంతటి వారినైనా అవసరాన్ని బట్టి తనకు అనుకూలంగా మలచుకోగలదు.
మరి అటువంటి బీజేపీ ని దాటుకుని కవిత తెలంగాణ రాజకీయంలో మనగలదా.? కవిత, కేసీఆర్ ను కాదని, బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేస్తున్న ఈ రాజకీయ అడుగులు తప్పటడుగులు మాదిరే మారబోతున్నాయా.? అసలు కవిత ఏ రాజకీయ ఎజెండాతో ముందుకెళ్లబోతున్నారు.? తనకంటూ ఒక ప్రత్యేక నినాదంతో రాజకీయం చేయకపోతే షర్మిల మాదిరే కవిత ప్రయాణం కూడా దారితప్పిన నావ మాదిరే అవుతుంది.




