ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలనెలా ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి వస్తుండేవారు. రాష్ట్రానికి సంబందించిన అంశాలు, రావాల్సిన నిధుల గురించి చర్చించేందుకు ఢిల్లీ వెళుతున్నారని వైసీపి నేతలు చెప్పుకునేవారు.
జగన్ అడిగిన వెంటనే మోడీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్ ఇస్తుండటం, జగన్ వారితో ఫోటోలు దిగుతుండటాన్ని వైసీపి వారి సాక్షి మీడియా చాలా గొప్ప విషయంగా చూపుకొని గర్వపడుతుండేవారు. కానీ జగన్ అడిగిన వెంటనే మోడీ ఆయనకు వందలు, వేల కోట్ల రూపాయలు అప్పులు ఇప్పిస్తూ, రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు మదనపడేవారు. ఈ కారణంగానే ఆంధ్రా ప్రజలలో బీజేపీ పట్ల వ్యతిరేకత ఏర్పడి అది క్రమంగా పెరుగుతూ వచ్చింది కూడా.
అయితే బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాంకుమార్ యార్లగడ్డ ఇటీవల ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ భేటీల వెనుక అసలు విషయం బయటపెట్టేశారు.
ప్రజలు, ప్రతిపక్షాలు భావిస్తున్నట్లుగానే జగన్ తన కేసులు, అప్పుల కోసమే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తుండేవారని చెప్పారు. అయితే చాలాసార్లు ప్రధాని మోడీ చాలా బిజీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనను కలిసేందుకు వచ్చేవారని, అప్పుడు ఆయన కోసం ఎదురుచూస్తూ బేస్‌మెంట్‌లో తన కారులోనే జగన్ కూర్చొనేవారని రాంకుమార్ యార్లగడ్డ చెప్పారు.
కొన్నిసార్లు ప్రధాని మోడీ ఒకటి రెండు నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చినప్పుడు, జగన్ హడావుడిగా వచ్చి ఆయన చేతిలో జ్ఞాపికను పెట్టి ఓ ఫోటో దిగి వెళ్ళిపోయేవారని రాంకుమార్ యార్లగడ్డ కొత్త విషయం బయటపెట్టారు.
ఇక్కడ వైసీపి నేతలు, వారి సొంత మీడియా ఆ ఫోటో, వీడియోని చూపించుకుంటూ ప్రధాని నరేంద్రమోడీ తమ అధినేతకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ప్రచారం చేసుకునేవారని, దాని వలన రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా చాలా నష్టపోతోందనే విషయం మేము ఆలస్యంగా గ్రహించామని రాంకుమార్ యార్లగడ్డ చెప్పారు.
ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు టిడిపి, జనసేనలతో కలిసి ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ భాగస్వామి ఉండగా, అక్కడ కేంద్రంలో టిడిపి, జనసేనలు భాగస్వాములుగా ఉండటం చాలా శుభపరిణామమని రాంకుమార్ యార్లగడ్డ చెప్పారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ నేతలలో కొంతమంది వైసీపికి అనుకూలంగా వ్యవహరించేవారు. అందువల్లే ఈ విషయాలను అప్పుడు ఎవరూ బయటపెట్టలేదు. పైగా జగన్‌ని వెనకేసుకువస్తున్నట్లు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు టిడిపితో సెట్ అయ్యారు కనుక ఒక్కో రహస్యం బయటపెడుతున్నారు. ప్రధాని మోడీతో జగన్ భేటీల వ్యవహారం వాటిలో ఒకటనుకోవచ్చు. కానీ ప్రధాని మోడీతో జగన్ ఫోటో దిగుతూ వాటితో కూడా తమని దెబ్బతీస్తున్నారనే విషయం ఆలస్యంగానైనా బీజేపీ గ్రహించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది కనుకనే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామి కాగలిగింది.




