ఇండియాలో అత్యంత విజయవంతమైన పీఎస్ఎల్వీ రాకెట్. ప్రపంచంలో మరే దేశమూ తలపెట్టని విధంగా 104 ఉపగ్రహాలు ఒకేసారి అంతరిక్షంలోకి… భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ37 నిమ్ములు చిమ్ముతూ నింగికెగసింది. సరిగ్గా ఉదయం 9.28 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ37 టేకాఫ్ తీసుకుంది.
తనతో పాటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 104 శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. ఇందులో భారత ఉపగ్రహాలు 3 ఉండగా, మిగిలినవన్నీ 101 విదేశీ ఉపగ్రహాలే. వీటిలో భారత్ కు చెందిన 714 కిలోల బరువున్న కార్టోశాట్ 2డీ ఉపగ్రహం అత్యంత బరువైనది. వందకు పైగా శాటిలైట్లను ఒకేసారి నింగిలోకి పంపుతున్న నేపథ్యంలో, ప్రపంచమంతా ఇస్రో ప్రయోగాన్ని ఆసక్తికరంగా పరిశీలిస్తోంది.
తన నిర్దిష్ట మార్గంలో ప్రయాణించే రాకెట్, మొత్తం 104 శాటిలైట్లను వాటి నిర్దిష్ట కక్ష్యల్లో ప్రవేశపెట్టడం అత్యంత కీలకమైన వ్యవహారం. 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఉపగ్రహాలను కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం మొదలవుతుంది. 20 నిమిషాల తర్వాత ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోవడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ అంతా విజయవంతంగా సాగిందని ఇస్రో అధికారులు స్పష్టం చేసారు.
తనతో పాటు తీసుకెళ్లిన 104 ఉపగ్రహాలనూ విజయవంతంగా వాటి వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్టిందని ఇస్రో అధికారులు అధికారికంగా ప్రకటించడంతో భారత ఖ్యాతి జగద్వితమైంది. ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయిందని తెలిపారు. మొత్తం 524 కిలోమీటర్ల దూరాన్ని 22 నిమిషాల్లో ప్రయాణించిన రాకెట్ అన్ని ఉపగ్రహాలను విడిచిందని, వాటి నుంచి భూమిపై వివిధ ప్రాంతాల్లో ఉన్న సెంటర్లకు సిగ్నల్స్ అందుతున్నాయని చెప్పారు.
ఈ ప్రయోగం విజయం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. గతంలో రష్యా ఒకేసారి 37 ఉపగ్రహాల ప్రయోగించిన రికార్డును ఇండియా బద్దలు కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ ప్రయోగానికి సహకరించిన ప్రభుత్వానికి, ఆలోచనలు చేసిన శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుదాం. ఈ సక్సెస్ తో ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపుకు చూస్తున్నాయి.
నాసా తన చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఉపగ్రహాలను ఒకేసారి ప్రవేశపెట్టే ధైర్యం కూడా చేయలేకపోగా, అంతరిక్ష పరిజ్ఞానంలో సత్తా చాటుతున్న రష్యా సైతం ఇన్ని శాటిలైట్లను ఒకేసారి ప్రయోగించలేదు. ఇక పొరుగునే ఉన్న చైనా సైతం అసూయపడేలా భారత్ సృష్టించిన ఈ ఘన చరిత్రను, అద్భుత రికార్డును పడగొట్టాలంటే, అది తిరిగి మనకే సాధ్యమని సోషల్ మీడియాలో నెటిజన్లు సందడి చేస్తున్నారు.



