సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ రాష్ట్రానికి ఐటి కంపెనీలు రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే విశాఖకు టీసీఎస్ వంటి సంస్థలు రాగా త్వరలోనే గూగుల్ కూడా వస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న అమరావతిలో క్వాంటం వ్యాలీ, టవర్స్ నిర్మిస్తున్నందున ఐటి కంపెనీలు అక్కడికి క్యూ కట్టడం ఖాయమే.
కనుక భవిష్యత్తులో బెంగళూరు నుంచి ఐటి కంపెనీలు విశాఖ లేదా అమరావతికి తరలివచ్చే అవకాశాలున్నాయని భావించవచ్చు.
దీనికి మరికొన్ని బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఐటి కంపెనీల వలన కర్ణాటక ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, గుంతలు పడిన రోడ్లను మరమత్తులు చేయించకపోవడాన్ని ఐటి కంపెనీలు, ఉద్యోగులు కూడా తప్పు పడుతూనే ఉంటారు.
వారి విమర్శలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోగా ఐటి కంపెనీలలో స్థానికులకు 50 శాతం రిజర్వేషన్స్ వంటి ప్రతిపాదనలు చేస్తూ ఆందోళన కలిగిస్తుంటుంది.
బెంగళూరు శివారులో బెళ్ళందూర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ‘బ్లాక్‌బక్’ అనే ప్రముఖ ఐటి కంపెనీ సీఈవో ‘రాజేష్ యాబాజీ గుంతలు పడిన రోడ్ల పరిస్థితి వివరిస్తూ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నాము,” అని ట్వీట్ చేశారు.
ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తూ, దేశంలో అత్యుత్తమ పరిశుభ్రమైన నగరాలలో విశాఖకు రావలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మీ కంపెనీని వేరే రాష్ట్రానికి మార్చే ఆలోచన ఉంటే దయచేసి నేరుగా నాకే మెసేజ్ పంపించండి,” అని విజ్ఞప్తి చేశారు.
బెంగళూరులో రోడ్లు బాగోనందునే ఐటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవాలనుకుంటున్నప్పుడు, వాటిని ఆకర్షించాలంటే ముందుగా విశాఖలో రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది కదా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఒకటిన్నర సంవత్సరం కాబోతోంది. కానీ ఇంతవరకు విశాఖలో కొత్తగా ఒక్క రోడ్, ఫ్లై ఓవర్ కూడా నిర్మించలేదు. కనుక ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ కష్టాలు అలాగే ఉన్నాయి.
ఐటి కంపెనీలకు కేవలం ప్రోత్సాహకాలు ఇస్తే తరలి వచ్చేయవు. మంచి రోడ్లు, నిరంతర విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కూడా కల్పించాలి.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల సురేష్ ముగ్గురూ తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా రావడం లేదు… ఎందుకు?అని ఆలోచిస్తే ప్రోత్సాహకాలు, మౌలిక వసతులతో పాటు రాజకీయ సుస్థిరత కూడా చాలా అవసరమేనని భావిస్తుండటం వల్లనే!
నేటికీ ఏపీకి ‘జగన్ భయం’ వెంటాడుతూనే ఉంది. అందువల్లే సినీ పరిశ్రమ రావడం లేదు. ఐటి కంపెనీలకు కూడా ఈ బూచిని చూసి భయపడుతూనే ఉంటాయి. కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఆ బూచితో మళ్ళీ ఇబ్బందులు లేకుండా చేయడం కూడా చాలా అవసరం. అప్పుడు పిలవకపోయినా సినీ పరిశ్రమ, ఐటి కంపెనీలు ఏపీకి క్యూ కడతాయి.





