ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ తీర్మానం చేసేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే జగన్ టీమ్ హాజరవలేదు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జగన్ అమరావతికి జైకొట్టినా, ఆ తర్వాత ఏం చేశారో అందరికీ తెలుసు.
జగన్ నేటికీ అమరావతికి వ్యతిరేకిస్తున్నందునే ఈ ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు. శాసనసభకు హాజరయ్యి తాము అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తున్నామనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కానీ అలా చేస్తే ప్రజలలో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది.
జగన్‌ని మళ్ళీ గెలిపిస్తే అమరావతిని మళ్ళీ పాడుబెట్టేస్తారని ప్రజలకు అర్ధమవుతుంది. కనుక కూటమి-వైసీపీల మద్య ఇంకా ఊగిసలాడుతున్నవారు కూడా వచ్చే ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే 11 నుంచి 0కి పడిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక తీర్మానం పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై జగన్ నోరు మెదపలేదు.
కానీ నాడు ప్రధాని మోడీ స్వయంగా భూమిపూజ చేసిన అమరావతిని పక్కన పడేస్తే ఎవరూ ఏం చేయలేకపోయారు. నేను అమరావతిని వద్దనుకున్నప్పుడు ఈ తీర్మానాలు, పార్లమెంట్ ఆమోదముద్రలు ఏం చేయగలవు?దీనికీ నా దగ్గర తగిన విరుగుడు ఉంది. ఇప్పుడే బయటపడటం దేనికి? అని జగన్ లోలోన ముసిముసి నవ్వులుకునే ఉంటారు.
జగన్ మనసులోని ఈ మాటలనే మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పలరాజు ముగ్గురూ నిన్న శ్రీకాకుళం జిల్లా నౌపాడ సభలో చాలా స్పష్టంగా చెప్పారు.
“లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతి మీద ఖర్చు చేస్తే మిగిలిన రాష్ట్రమంతా ఏమైపోవాలి. అమరావతి తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాల అభివృద్ధిని పట్టించుకోరా? అమరావతి నిర్మాణం కోసం ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసి తెచ్చి ఖర్చు చేస్తారు? ఎప్పటికి పూర్తి చేస్తారు? అమరావతి భారం మనకి అవసరమా?” అని బొత్స ప్రశ్నించారు.
ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, “ఇప్పటికే మూడుసార్లు రాజధానులు మారాయి. రేపు కొత్త ప్రభుత్వం వచ్చి అమరావతి మాకొద్దంటే పరిస్థితి ఏమిటి?రేపు అమరావతి చుట్టుపక్కల వారు అందరినీ అక్కడి నుంచి పొమ్మంటే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు నాయుడు ఓ కాగితం ముక్క పట్టుకొని ఢిల్లీ వెళ్లి స్టాంప్ వేయించేసుకుంటే సరిపోతుందా? ప్రజలపై బలవంతంగా అమరావతిని రుద్దుతుంటే అందరూ భరించాలా?” అని అన్నారు.
సీదిరి అప్పల్రాజు మాట్లాడుతూ, “రాష్ట్ర సంపద మొత్తం తీసుకువెళ్ళి అమరావతికి ధారపోస్తున్నవారు రాష్ట్ర ద్రోహులు. అలాంటివారిని ప్రజలు క్షమించరు,” అని అన్నారు.
వారు ముగ్గురూ వైసీపీలో సీనియర్లే… కనుక ఇవి వారి సొంత అభిప్రాయాలు కావు. జగన్ తన మనసులో మాట నేరుగా చెప్పకుండా వారి ద్వారా ఇలా చెప్పించారు.
ప్రజలు, మీడియా, సోషల్ మీడియా రియాక్షన్ చూసేందుకే వారితో ఈవిధంగా మాట్లాడించి ఉండవచ్చు. కనుక నేటికీ జగన్ అమరావతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూన్నారనే విషయం స్పష్టమవుతోంది.
అమరావతి విషయంలో వైసీపీ నేతలు ఇంత ధైర్యంగా, ఇంత బహిరంగంగా, ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, కూటమిలో టీడీపితో సహా మూడు పార్టీల నేతలకు వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టవచ్చనే ఆలోచన కూడా కలగకపోవడం విచిత్రం.
ఏది ఏమైనప్పటికీ, అమరావతికి వైసీపీ వ్యతిరేకమని స్పష్టం చేసింది. కనుక ఎన్నికల వరకు కనీసం ఈ వైఖరిపైనైనా జగన్ మాట తప్పకుండా మడమ తిప్పకుండా గట్టిగా నిలబడితే అదే పదివేలు! అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు, కూటమి పార్టీలకు శ్రీరామ రక్ష!






