జగన్ కు ఏపీ ఒక విడిదిల్లా.?

Jagan’s Andhra Politics from Bengaluru

వచ్చారు… జైజై లు కొట్టించుకున్నారు…తిట్టారు…వెళ్లిపోయారు…ప్రస్తుతం వైస్ జగన్ ఏపీలో చేస్తున్న బెంగళూర్ రాజకీయం ఇదే. వైసీపీ ఘోర ఓటమి తరువాత తాడేపల్లి ప్యాలస్ నుంచి బెంగళూర్ ప్యాలస్ కు మకాం మార్చిన వైస్ జగన్ బెంగళూర్ కేంద్రంగానే తన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు.

వైసీపీ అందగాళ్ళ అరెస్టుల నేపథ్యంలో ఒక సారి, వైసీపీ సౌమ్యుల పరామర్శల కోసం మరోసారి, వైసీపీ బ్రాండ్ అయిన శవ రాజకీయాల కోసం ఇంకో సారి ఇలా ఈ మూడు సందర్భాలలో మాత్రమే వైస్ జగన్ ఏపీ లో అడుగుపెడుతున్నారు, ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు, పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు ని విమర్శిస్తున్నారు, ఇక ఆ పై వచ్చిన కార్యం ముగిసిందని తిరిగి బెంగళూర్ ఫ్లయిట్ ఎక్కుతున్నారు.

ADVERTISEMENT

నేడు లింగయ్య మృతి పై ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాప్తాడు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి లింగయ్య మృతి పై కంటే కూడా ప్రభుత్వం పై పోలీస్ అధికారుల పై ఎక్కువగా ఫోకస్ పెట్టి తానూ చెప్పదలచుకున్న నాలుగు ముక్కలు చెప్పి, తానూ తిట్టదలచుకున్న నలుగురు వ్యక్తులను తిట్టేసి, తిరిగి బెంగళూర్ పయనమయ్యారు.

గత ఐదేళ్లు చంద్రబాబు ను ఏపీలో సొంత ఇల్లు కూడా లేదు, కేవలం రాజకీయ లబ్ది కోసమే పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు, ఏపీ ప్రజల మీద బాబుకి ప్రేమ లేదు, టీడీపీ కి చిత్తశుద్ధి లేదు, కేవలం రాజకీయ అవసరం మాత్రమే ఉందంటూ బాబుని వీక్ ఎండ్ పొలిటీషియన్ అంటూ జగన్ తో సహా వైసీపీ శ్రేణులంతా విమర్శించేవారు.

అలాగే పవన్ ను సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం పొలిటీషియన్ మాదిరి ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు అంటూ తప్పుబట్టేవారు. కానీ ఇప్పుడు వైస్ జగన్ చేస్తున్న రాజకీయానికి ఏ పేరు పెట్టాలి, ఆయనను ఏ పొలిటీషియన్ గా నామకరణం చెయ్యాలి అంటున్నారు కూటమి నేతలు. సినిమాల్లో వచ్చే స్పెషల్ గెస్ట్ పాత్ర మాదిరి, వేదికల మీద దర్శనమిచ్చే చీఫ్ గెస్ట్ తరహా రాజకీయాలు చేస్తూ జగన్ ఏపీ ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారు.

గత ఐదేళ్లు అధికారంలో ఉండి ప్యాలస్ గడప దాటని రాజకీయాలు చేసిన జగన్ పరదాల ముఖ్యమంత్రిగా పేరు గడిస్తే, ఇప్పుడు బెంగళూర్, తాడేపల్లి ప్యాలస్ ల చుట్టూ తిరుగు శవ రాజకీయాలు చేస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు జగన్ తనకు అవసరం అనుకున్న రోజు మాత్రమే గడప దాటి ప్రజల మధ్యకు వస్తున్నారు, అది పాదయాత్రలైనా, ఓదార్పు యాత్రలైనా.

ఓటమి ఎదురైతే ఇలా సొంత రాష్ట్రాన్ని విడిచి పెట్టి ఏపీని ఒక విడిది ప్రదేశంగా మార్చేసిన జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టా.? అలాగే ఇక్కడి ప్రజా సమస్యల పట్ల అవగాహనా వచ్చినట్టా.? ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతూ, నోటికొచ్చిన తిట్లు తిడుతూ ఇలా ఈ నాలుగేళ్లు జగన్ తానూ కళ్ళుమూసుకుంటూ వాస్తవ పరిస్థితులను తెలవనీయకుండా తన పార్టీ శ్రేణుల కళ్ళు కూడా మూయాలని చూస్తున్నారా.?

ADVERTISEMENT
Latest Stories